సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. రేపటి నుంచే ప్రారంభం, ఈనెల 23న ఫైనల్

Wait 5 sec.

ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. పార్టీ పరంగా 42 శాతం సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు చేయగా.. త్వరలోనే మరోసారి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల రెండో వారంలో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం.. అందుకు సంబంధించిన చర్యలకు సిద్ధం అయింది. ఎన్నికల సంఘం కసరత్తును మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితా మళ్లీ సవరణ చేసేందుకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 20వ తేదీన ఓటర్ల నుంచి దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరించనుంది. ఆ తర్వాత అందులో ఉన్న తప్పులను సవరించనుంది. ఆ తర్వాత ఈనెల 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు.. స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కారించనున్నారు. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత.. ఈనెల 23 వ తేదీన తుది ఓటర్ల జాబితాతోపాటు.. ఎన్నికలు నిర్వహించే పోలింగ్‌ కేంద్రాల ప్రచురణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో.. తెలంగాణలో డిసెంబరు రెండో వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరులోపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం. డిసెంబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనుండటంతో.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దృష్టి పెట్టాయి. ఇటీవల సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం.. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు.. న్యాయనిపుణుల సలహాలపై తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ రిపోర్ట్ ఇవ్వగా.. దానిపై మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈనెల 24వ తేదీన తెలంగాణ హైకోర్టులో ఈ అంశంపై విచారణ ఉందని వెల్లడించారు. మార్చి 31వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తేనే.. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.