అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును.. వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అయిన షై హోప్ సాధించాడు. బుధవారం.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో వేగవంతమైన సెంచరీ సాధించిన హోప్.. ఈ క్రమంలోనే ఇతర రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్నాడు. ఒక రికార్డు మాత్రం.. ఎవరూ సాధించనిది సొంతం చేసుకున్నాడు. కివీస్‌తో మ్యాచ్‌లో చేసిన శతకం.. ఆ జట్టుపై అతడికి ఇదే తొలి సెంచరీ. ఈ క్రమంలోనే ప్రస్తుతం టెస్ట్ హోదా ఉన్న అన్ని దేశాలపై ఇంటర్నేషనల్ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్‌గా అవతరించాడు. టెస్ట్ హోదా దేశాలు ప్రస్తుతం విండీస్‌తో కలిపి 12 ఉండగా.. మిగతా 11 దేశాలపైనా కనీసం ఒక్క సెంచరీ అయినా చేశాడు. షై హోప్ ఇప్పటివరకు వన్డే ఫార్మాట్‌లో 19 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 3 సెంచరీలు చేయగా.. ఒక సెంచరీ టీ-20 ఇంటర్నేషనల్స్‌లో ఉంది. హోప్ ఇప్పటివరకు చేసిన సెంచరీల లిస్ట్ చూస్తే.. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్‌పై 2, భారత్‌పై ఒక సెంచరీ సాధించాడు. టీ-20 క్రికెట్లో ఆస్ట్రేలియాపై ఒక శతకం సాధించాడు. ఇక వన్డేల్లో చూస్తే.. అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, సౌతాఫ్రికా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇప్పుడు న్యూజిలాండ్‌పై సెంచరీలతో మొత్తం 11 దేశాలపైనా ఘనత సాధించాడు. వన్డేల్లోనే 10 టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్‌పై సెంచరీలు చేయగా.. ఆసీస్‌పై మాత్రమే టీ-20ల్లో చేశాడు. ఈ సెంచరీతో.. వన్డేల్లో మొత్తం 19 సెంచరీలతో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. ఇతడు కూడా 19 సెంచరీలు చేయగా.. విండీస్ తరఫున క్రిస్ గేల్ 25 శతకాలతో టాప్‌లో ఉన్నాడు. ఇదే క్రమంలో వన్డే క్రికెట్‌లో 6 వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. కేవలం 147 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించిన హోప్.. వివ్ రిచర్డ్స్ తర్వాత విండీస్ తరఫున అత్యంత వేగంగా ఈ మార్కు చేరిన ఆటగాడిగా నిలిచాడు.ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లలో స్టార్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా జో రూట్, బాబర్ అజామ్, స్టీవ్ స్మిత్ ఇలా ఎవరూ ఈ రికార్డును అందుకోలేదు. అయితే.. గతంలో భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్.. తాము ఆడే సమయంలో టెస్ట్ హోదా కలిగిన దేశాలు 10 ఉండగా.. మిగతా 9 దేశాలపైనా సెంచరీలు చేశారు. అప్ఘానిస్థాన్, ఐర్లాండ్ 2017లో టెస్ట్ హోదా పొందాయి. దీంతో ఇప్పుడు ఈ అన్ని దేశాలపైనా సెంచరీలతో హోప్ చరిత్ర సృష్టించాడు.ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 34 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 రన్స్ చేసింది. హోప్ 69 బంతుల్లో 109 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. కేవలం 66 బంతుల్లోనే మూడంకెల మార్కు అందుకున్నాడు. మరే బ్యాటర్ 30 రన్స్ కూడా చేయలేకపోయారు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ 4, జేమిసన్ 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత కివీస్ 33.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాన్వే 90, రచిన్ రవీంద్ర 56 పరుగులు చేశారు. ఆఖర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 15 బంతుల్లో 34 రన్స్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 3 వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే.. 2-0తో సొంతం చేసుకుంది న్యూజిలాండ్.