తెగ కొనేశారు.. దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం.. లేటెస్ట్ డేటా రిలీజ్

Wait 5 sec.

SIAM Data: తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని పలు గణాంకాలు చెబుతుంటాయి. హైదరాబాద్ సహా పలు కీలక నగరాలు రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాయి. తాజాగా ఓ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. త్రీ-వీలర్ వెహికల్స్ విక్రయాల్లో తెలంగాణ ఈ ఘనత సాధించింది. పరిశ్రమల సమాఖ్యా సియామ్ (SIAM) తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం త్రీ-వీలర్ కేటగిరీలో అత్యధిక విక్రయాలు జరిపిన రెండో రాష్ట్రంగా నిలిచింది. ఇక మొత్తంగా చూసుకుంటే ప్యాసింజర్ వెహికల్స్, కమెర్షియల్ వెహికల్స్ సేల్స్‌లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లోని జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రయాణికుల, వాణిజ్య వాహనాల విక్రయాల డేటాను సియామ్ విడుదల చేసింది. ఈ రెండు కేటగిరీల్లోనూ మహారాష్ట్ర అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. రెండో త్రైమాసికంలో దేశం మొత్తం 10.39 లక్షల ప్రయాణికుల వాహనాలు విక్రయమయ్యాయి. ఇందులో పశ్చిమ రాష్ట్రాల్లో 3.44 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యూఫాక్చరింగ్ తెలిపింది. ప్రయాణికుల వాహనాల కేటగిరీ సేల్స్ పరిశీలిస్తే మహారాష్ట్ర 1,31,822 యూనిట్లతో (12.7 శాతం మార్కెట్ వాటా) అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉత్తర్ ప్రదేశ్ 1,00,481 యూనిట్లు (9.7 శాతం వాటా), మూడో స్థానంలో గుజరాత్ 87,901 యూనిట్లు (8.5 శాతం), కర్ణాటక 76,422 యూనిట్లతో నాలుగో స్థానం, కేరళ 69,609 యూనిట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. వాణిజ్య వాహనాల విషయానికి వస్తే 2.40 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అందులో మహారాష్ట్ర 37,091 యూనిట్లతో అగ్రస్థానంలో ఉంది. 22,491 యూనిట్లతో గుజరాత్ రెండో స్థానం, 19,009 యూనిట్లతో ఉత్తర్ ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో తమిళనాడు (18,508), ఐదో స్థానంలో కర్ణాటక (16,743) నిలిచాయి. ఇక బైకులు, స్కూటీల వంటి టూ-వీలర్ సెగ్మెంట్‌కి వస్తే మొత్తం 55.62 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. ఈ కేటగిరీలో మాత్రం 6,92,869 యూనిట్లతో ఉత్తర్ ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. 6,29,131 యూనిట్లతో మహారాష్ట్ర రెండో స్థానానికి పరిమితమైంది. మూడో స్థానంలో గుజరాత్ 4,45,722 యూనిట్లుతో నిలిచింది. తెలంగాణ టాప్-2ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో ఆటో రిక్షాల వంటి త్రీ-వీలర్ వాహనాల సేల్స్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా మొత్తం 2.29 లక్షల వాహనాలు విక్రయమయ్యాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధికంగా 77,000 యూనిట్లు సేల్ అవడం గమనార్హం. అయితే, 28,246 యూనిట్లతో ఉత్తర్ ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 26,626 యూనిట్లు (11.6 శాతం మార్కెట్ వాటా)తో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో గుజరాత్ 22,572 యూనిట్లతో ఉంది. మహారాష్ట్రలో 21,100 యూనిట్లు, కర్ణాటకలో 18,048 యూనిట్లు విక్రయాలు జరిగాయి.