అన్నవరం వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ ధరలు పెంచుతూ నిర్ణయం, తెలుసుకోండి

Wait 5 sec.

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో వసతిగదుల అద్దె పెంచనున్నారు. ఈ మేరకు వసతి గదుల అద్దెను పెంచాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి. రత్నగిరిపై ఉన్న ప్రకాష్ సదన్, పాత, కొత్త సెంటనరీ కాటేజీలు, సత్యగిరిపై హరిహరసదన్ వంటి పలు వసతి సముదాయాల్లో గదుల అద్దెలు పెరగనున్నాయి. ఇటీవల వసతి సముదాయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచి ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.రత్నగిరిపై ఉన్న ప్రకాష్ సదన్‌లో ప్రస్తుతం రూ.999 ఉన్న గది అద్దె రూ.1,200కు (5 శాతం జీఎస్టీ అదనం) పెరగనుంది. అలాగే సెంటనరీ కాటేజీల్లో గది అద్దె రూ.500 నుంచి రూ.700కు పెరుగుతుంది. ఇటు హరిహరసదన్‌లో ప్రస్తుతం రూ.950 ఉన్న గది అద్దె రూ.1,500కు (జీఎస్టీతో కలిపి) పెంచనున్నారు. ఈ సముదాయంలో నాన్ ఏసీ గదుల అద్దె రూ.600 నుంచి రూ.700కు పెరగనుంది. అన్నవరంలోని వసతి గదుల అద్దె పెంపు ప్రతిపాదనలను దేవస్థానం అధికారులు కమిషనర్‌కు పంపించారు. ఆ తర్వాత కమిషనర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త అద్దెలు అమలు చేయనున్నారు. మరోవైపు కార్తీక మాసం కావడంతో అన్నవరం దేవస్థానంలో రద్దీ కనిపించింది. దేవాదాయశాఖ కమిషనర్‌ ఫోకస్ పెట్టడంతో భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. అయినా సరే కొందరు భక్తులు ఇబ్బందిపడ్డారనే టాక్ వినిపిసత్తోంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆలయంలో పార్కింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్తీక మాసం కావడంతో కొండపై వాహనాలు భారీగా వచ్చాయి. దీంతో కొన్ని వాహనాలను కొండ దిగువున నిలపాల్సి వచ్చింది.సత్యగిరిపై పార్కింగ్‌ స్థలాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందంటున్నారు. అలాగే భక్తులు ఆలయానికి భక్తులు చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలి అంటున్నారు. వసతి గదుల సంఖ్యను కూడా పెంచితే బావుంటుందంటున్నారు. మరికొన్ని గదుల నిర్మించాలని.. డార్మెటరీలు ఏర్పాటు చేయాలంటున్నారు. వీటితో పాటుగా లాకర్లు, మరుగుదొడ్లు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. క్యూలైన్లలో కూడా కొన్ని మార్పులు చేయాలంటున్నారు. ఆలయంలో దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అలాగే వ్రతమండపాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు.