కర్ణాటక యువ బ్యాటర్ రంజీ ట్రోఫీలో మరొకసారి తన ప్రతిభను చాటుకున్నాడు. హుబ్లీలో ఛండీగఢ్‌పై జరుగుతున్న మ్యాచ్‌లో 362 బంతుల్లో 227 పరుగులతో నాటౌట్‌గా నిలవడమే కాకుండా, కర్ణాటకకు భారీ స్కోర్ అందించాడు. ఇది సమరన్ కెరీర్‌లో మూడో ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ కాగా, ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లలో సాధించిన రెండో డబుల్ టన్ కావడం విశేషం. ఛండీగఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో బ్యాటింగ్ మొదలుపెట్టిన కర్ణాటక 13/2, తర్వాత 64/3కి కుంగిపోయింది. ఈ సమయంలో కరుణ్ నాయర్–సమరన్ జోడీ కీలకమైన 119 పరుగుల భాగస్వామ్యం అందించింది. కరుణ్ నాయర్ 164 బంతుల్లో 95 పరుగులతో పెవిలియన్ చేరినా, సమరన్ మాత్రం అద్భుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనంతరం శ్రేయస్ గోపాల్ (62), శిఖర్ శెట్టి (59) కూడా తోడవ్వడంతో.. చివరకు కర్ణాటక 547/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఈ రంజీ సీజన్‌లో సమరన్ కేరళపై 220 నాటౌట్, మహారాష్ట్రపై 54 తర్వాత ఈ మ్యాచ్‌లో 227 నాటౌట్‌గా నిలిచి ప్రస్తుత రంజీ సీజన్‌లో నాలుగో స్థానానికి చేరాడు. ఇప్పటివరకు 595 పరుగులు సాధించిన సమరన్ సగటు 119 ఉండటం విశేషం. . లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన సమరన్ కర్ణాటక తరఫున అండర్-14 స్థాయి నుంచే ఆడుతున్నాడు. రాష్ట్రంలోని మహారాజా టీ20 ట్రోఫీలో గుల్బర్గా మిస్టిక్స్, శివమొగ్గ స్ట్రైకర్స్ తరఫున కూడా మెరిశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు కేవలం 13 మ్యాచ్‌లలో 1179 పరుగులు చేశాడు, అందులో నాలుగు సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. లిస్టు-ఏ క్రికెట్‌లో కూడా సమరన్ అద్భుతం. 2024–25 విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున 433 పరుగులు చేశాడు.ఐపీఎల్‌లో కూడా సమరన్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో హర్ష్ దుబే స్థానంలో సమరన్ రీప్లేస్‌మెంట్ సైన్ చేశాడు. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడకముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతన్ని ఐపీఎల్ 2026 కోసం కూడా రిటైన్ చేసింది.