ఎకరం రూ.20 లక్షలు.. నో చెప్పిన ఊరిజనం..

Wait 5 sec.

సాధారణంగా ప్రభుత్వాలు ఏవైనా ప్రాజెక్టులు చేపట్టేముందు భూసేకరణ చేపడుతాయి. భూములు సేకరించిన రైతులకు ప్యాకేజీని ప్రకటిస్తాయి. అయితే రైతుల నుంచి ముందు అభిప్రాయాలు సేకరించిన తర్వాతే భూసేకరణ దిశగా అడుగులు వేస్తాయి. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలోని రైతులు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని తిరస్కరించారు. ఎకరాకు రూ.20 లక్షలు ప్యాకేజీని తిరస్కరించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కావలి మండలం చెన్నాయపాలెంలో భూసేకరణపై గ్రామసభ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, మారిటోరియం బోర్డు డిప్యూటీ కలెక్టర్, కావలి తహసీల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా భూసేకరణ విధివిధానాలను అధికారులు రైతులకు వివరించారు. అనంతరం ఈ విధివిధానాలపై గ్రామస్థుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నాయపాలెం, పెద పట్టపుపాలెం వాసులు ప్రభుత్వం ప్యాకేజీని తిరస్కరించారు.ప్రభుత్వానికి భూములిస్తే తమ జీవనాధారం ఏమిటంటూ ఈ ఊరి జనం అధికారులను ప్రశ్నించారు. వ్యవసాయంతో పాటుగా పాడి పశువులు, చేపల వేట మీద ఆధారపడి తాము జీవిస్తున్నామని.. ఇప్పుడు తక్కువ ప్యాకేజీకి భూములు అప్పగించేస్తే తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్యాకేజీని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు అన్నిరకాలుగా ఆదేశించిన తరువాతే ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున చెల్లించేలా ప్యాకేజీ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థుల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని వెల్లడించారు. మరోవైపు నెల్లూరు జిల్లాలోఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కావలి మండలంలో మెగా పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మెగా ఏర్పాటు కోసం కావలి మండలంలోని మూడు గ్రామాల్లో భూసేకరణ జరపాలని ప్రతిపాదించారు. అధికారులు సర్వే కూడా చేపట్టారు. చెన్నాయపాలెం, తుమ్మలపెంట, అనెమడుగు గ్రామాల పరిధిలో ఈ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం సుమారుగా 2 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. మారిటైం బోర్డు ద్వారా ఈ భూసేకరణ చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నాయపాలెం గ్రామసభలో ప్యాకేజీపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల అభిప్రాయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.