ఉద్దానం వాసులకు ఇబ్బందులు పెడుతున్న కిడ్నీ వ్యాధుల సమస్య పరిష్కారానికి ఇండియన్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌( ఐసీఎంఆర్) రంగంలోకి దిగింది. కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేసేందుకు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్టు అనే పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును ఐసీఎంఆర్ మూడేళ్లలో పూర్తిచేయనుంది. మూడేళ్లలో పరిశోధనకు గానూ రూ.6.2 కోట్లను మూడు దశల్లో గ్రాంటు రూపంలో ఇవ్వనున్నారు. ఉద్ధానం కిడ్నీ సమస్యలపై ఐసీఎంఆర్ పరిశోధన త్వరలోనే ప్రారంభమవుతుందని.. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇక ప్రాజెక్టులో భాగంగా ఉద్దానంలో ర్యాండమ్ పద్ధతిలో తొలి విడ‌త కింద 5,500 మందిని ఎంపిక చేస్తారు. వారికి బ్లడ్ , యూరిన్ పరీక్షలు నిర్వహిస్తారు. యూరిన్ పరీక్షలను బ‌యోమార్కర్స్ విధానంలో టెస్ట్ చేస్తారు. మరోవైపు పాతికేళ్లుగా ఉద్దానంవాసులను కిడ్నీ సమస్య వెంటాడుతోంది. కిడ్నీ వ్యాధుల కారణంగా ఈ ప్రాంతంలో చాలా మంది చనిపోయారు. వ్యాధి బారినపడిన వారు బిక్కుబిక్కమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సేవలు, ఉచితంగా మందులు అందజేస్తోంది. కానీ, కిడ్నీ వ్యాధులు వ్యాపించడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణాలు అన్వేషించి తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. మరోవైపు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ చేయిస్తున్న ప్రభుత్వం.. వారికి ప్రతి నెలా రూ.10వేలు పింఛన్‌ అందిస్తోంది. మరోవైపు ప్రాంతంలో కిడ్నీవ్యాధులు వ్యాపించడానికి గల కారణాలు వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే డయాలసిస్ కోసం ఆస్పత్రులకు వెళ్లేవారికి వాహన సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ప్రతీ కుటుంబానికి 20 లీటర్ల చొప్పున నీటిని ఉచితంగా అందించాలని కోరుతున్నారు. కిడ్నీ వ్యాధి నియంత్రణలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరుతున్నారు. వైద్యశిబిరాలు నిర్వహించాలని.. అందరికీ రక్త పరీక్షలు చేయాలంటున్నారు. ఈ క్రమంలోనే ఐసీఎంఆర్ రంగంలోకి దిగనుండటంతో కిడ్నీ వ్యాధి మూలాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.