ఆ జిల్లా దశ తిరిగింది.. రూ.8,570 కోట్ల భారీ పెట్టుబడి.. ఉత్తర్వులు జారీ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి.. విశాఖపట్నం సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా పలు సంస్థలు పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నాయి. అయితే ఏపీకి మరో స్టీల్‌ప్లాంట్ వస్తోంది.. విజయనగరం జిల్లా గుర్ల మండలం కెళ్లలో స్టీల్‌ సూపర్‌ స్మెల్టెర్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. సూపర్‌ స్మెల్టెర్స్‌ లిమిటెడ్‌ సంస్థ ప్లాంట్‌ కోసం 1,085 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ స్టీల్‌ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2 మిలియన్‌ టన్నులు. దీని నిర్మాణానికి రూ.8,570.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా 750 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్టీల్‌ప్లాంట్‌తో పాటు, టౌన్‌షిప్‌ ఏర్పాటుకు అదనంగా 97.04 ఎకరాలు, రైల్వే సైడింగ్‌ కోసం 53.35 ఎకరాలు కూడా కేటాయించనున్నారు. ఈ స్టీల్‌ ప్లాంట్‌ను రెండు దశల్లో నిర్మించనున్నారు.విజయనగరం జిల్లాలో వేల కోట్ల రూపాయలతో ఒక ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పరిశ్రమలు రావడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. తో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, దాదాపు 16 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. అయితే సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.స్టీల్‌ప్లాంటు ఏర్పాటుపై జిల్లా ప్రజాప్రతినిధులంతా ఏకమై ప్రభుత్వానికి తమ అభిప్రాయం తెలిపారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్లాంటుతో జిల్లాలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి, వలసలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గత సీఐఐ సదస్సుకు, ప్రస్తుత సదస్సుకు తేడా ఉందని, దానిని గమనించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎప్పుడూ ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారని, సీఐఐ సదస్సు గురించి కూడా వారు విమర్శలు చేస్తున్నారన్నారు.