Gold Price Hits All Time High: అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో.. సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీంతో వీటిపైకి విస్తృతంగా పెట్టుబడులు వస్తుండగా.. ధరలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, ఆల్ టైమ్ హైకి చేరాయి. ఒకవైపు ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడటం సహా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా అనిశ్చితికి కారణమవుతోంది. . ఇది కూడా ఆందోళనల్ని రేకెత్తిస్తోంది. ఇప్పుడు దేశీయంగా.. బంగారం, వెండి రేట్లు జీవన కాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసడి ధర ఒక్కరోజే రూ. 2250 పెరగడంతో తులం రూ. 1,34,050 కి ఎగబాకింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2460 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,46,240 వద్ద ట్రేడవుతోంది. బంగారాన్ని మించి వెండి ధర పెరుగుతోంది. ఇవాళ రేటు మరో రూ. 8 వేలు పెరగడంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 3.18 లక్షలు పలుకుతోంది. ఇక 2025 అక్టోబర్ నెల ప్రారంభంలో రూ. 1.61 లక్షల వద్ద ఉండేది. ఇప్పుడు 3 నెలల్లోనే ఇది రెట్టింపు అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే వెండికి పారిశ్రామికంగా మంచి డిమాండ్ ఉండగా.. ఇప్పుడు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి గిరాకీ అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో వెండి ధర కూడా అమాంతం పెరిగిపోతోంది. గత 3 నెలల్లోనే ఇక్కడ సిల్వర్ రేటు రెట్టింపు కావడం షాక్‌కు గురిచేస్తోంది. డిమాండ్ కంటే ఉత్పత్తి/ సప్లై తక్కువగా ఉండటం వల్ల కూడా వెండి రేటు విపరీతంగా పెరిగేందుకు కారణంగా తెలుస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఆల్ టైమ్ హై వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4,670 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. సిల్వర్ రేటు 93 డాలర్ల స్థాయిలో ఉంది. ఒక దశలో ఇంట్రాడేలో ఇది 94 డాలర్ల మార్కు దాటి ట్రేడయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 90.95 వద్ద ఉంది.