కడపలో సచివాలయ ఉద్యోగి విజయకుమారి చనిపోయారు. నగరంలోని 27/2 గౌస్‌ నగర్‌ సచివాలయంలో పనిచేస్తున్నారు. ఈ నెల 17న మధ్యాహ్నం పాత కడప యూపీహెచ్‌­సీలో విజయకుమారి విధి నిర్వహణలో ఉన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఊపిరి ఆడడం లేదని చెప్పారు. అలా ఆమె కళ్లు మూసుకుని ఒరిగిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.. తల్లి మరణంతో వారిద్దరు తీవ్ర విషాదంలో ఉన్నారు. విజయకుమారి మరణానికి అధికారుల ఒత్తిడే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె మరణంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.'సచివాలయ ఉద్యోగిని జి. విజయకుమారి మృతిపై అసత్య ప్రచారాలు - వాస్తవాలు. వైఎస్సార్ కడప జిల్లాలో హెల్త్ సెక్రటరీ (ANM) జి. విజయకుమారి గారు అధికారుల వేధింపులు, పని ఒత్తిడి కారణంగా మరణించారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DMHO) దర్యాప్తు నివేదిక మరియు ఆసుపత్రి వైద్య రికార్డుల ప్రకారం, ఆమె మరణానికి అసలు కారణం గత ఆరు సంవత్సరాలుగా ఆమె వేధిస్తున్న దీర్ఘకాలిక గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత అనారోగ్యం' అన్నారు.'విజయకుమారి గారు 'క్రానిక్ పల్మనరీ థ్రోంబోఎంబోలిజం' (ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం) మరియు 'పల్మనరీ హైపర్‌టెన్షన్' వంటి ప్రాణాంతక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆమె హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్ మరియు బెంగళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీలో నిరంతరం చికిత్స పొందుతున్నారు. జూన్ 2024లో ఆమె ఊపిరితిత్తుల సమస్యల వల్లే బెంగళూరులోని ఆసుపత్రి ఐసీయూలో కూడా చికిత్స పొందారు. సెప్టెంబర్ 2025లో వైద్యులు ఆమెను ఎటువంటి కష్టతరమైన పనులు చేయకూడదని హెచ్చరించారు' అని వివరించారు.'ఆమె అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, మానవతా దృక్పథంతో ఆమె కోరిక మేరకు తన ఇంటికి సమీపంలో ఉండే గౌస్ నగర్ సచివాలయానికి డిప్యుటేషన్‌పై బదిలీ చేసింది. సంక్రాంతి సెలవుల తర్వాత సచివాలయాలు జనవరి 17, 2026 శనివారం నాడు మాత్రమే పునఃప్రారంభమయ్యాయి. ఆ రోజున ఎటువంటి సమీక్షా సమావేశాలు గానీ, పని ఒత్తిడి గానీ లేదని అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి' అని చెప్పుకొచ్చారు.'జనవరి 18, 2026 తెల్లవారుజామున ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. 108 అంబులెన్స్ సిబ్బంది ఆమె నివాసానికి చేరుకునే సమయానికే ఆమె ప్రాణాలు విడిచినట్లు ధృవీకరించారు. కావున, సహజమైన అనారోగ్య కారణాల వల్ల జరిగిన ఈ మరణాన్ని ప్రభుత్వ వేధింపుల వల్ల జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం తగదు. విజయకుమారి గారి మృతి ఆమెకున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల సంభవించిన అకాల మరణం మాత్రమే' అంటూ ట్వీట్ చేశారు.