ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు సమయానికి హాజరయ్యేలా చూడటం కోసం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇకపై ఆలస్యంగా విధులకు హాజరైతే ఆ రోజు వేతనంలో కోత విధించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రధానంగా ఇది సచివాలయ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇకపై సచివాలయ ఉద్యోగులు కచ్చితమైన సమయానికి విధులకు హాజరుకావాల్సిందే. ఆలస్యమైతే ఆ రోజు వేతనంలో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరింత పటిష్టం చేయాలని భావిస్తున్న సర్కార్, ఆ దిశగా అనేక సంస్కరణలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయాలను ‘స్వర్ణ గ్రామాలు’గా, వార్డు సచివాలయాలను ‘స్వర్ణ వార్డులు’గా మార్చేందుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా సచివాలయ పాలనలోనూ మార్పులు తీసుకురావాలని భావిస్తున్న సర్కార్, ఆ దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సమయపాలన, హాజరు విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.వైసీపీ ప్రభుత్వం 2019లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో సచివాలయంలో 11 నుండి 13 మంది వరకు సహాయకులను నియమించారు. గతంలో విధులపై మాతృశాఖల అజమాయిషీ ఉండేది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీనిని సరి చేసే ప్రయత్నం చేస్తోంది.విజయనగరం జిల్లాలో 777 పంచాయతీలు ఉండగా, 626 గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 5,781 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, సచివాలయ సిబ్బందిలో చాలా మంది సమయపాలన పాటించడం లేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది.ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ‘ఫేషియల్ రికగ్నిషన్’ (Facial Recognition) హాజరును తప్పనిసరి చేసింది. సచివాలయ సిబ్బంది పని వేళలను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించింది. కచ్చితంగా ఈ సమయంలోనే సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. సమయానికి హాజరు వేయకుంటే ఆ రోజు వారు విధులకు రానట్లుగానే పరిగణించి, వేతనంలో కోత విధించేలా విధి విధానాలను రూపొందించింది.