ముంబైలో మళ్లీ రిసార్ట్ రాజకీయాలు.. బీజేపీకి షిండే చెక్.. మేయర్ పీఠంపై శివసేన పట్టు?

Wait 5 sec.

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. 25 ఏళ్ల ఠాక్రే కుటుంబ పాలనకు తెరదించుతూ బీజేపీ-షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించినప్పటికీ.. మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ముంబైలో మళ్లీ రిసార్ట్ పాలిటిక్స్ మొదలైంది. బీజేపీ-శివసేన (షిండే వర్గం) కూటమి మెజారిటీ మార్కును దాటినప్పటికీ.. తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా ఏకనాథ్ షిండే అలర్ట్ అయ్యారు. గెలిచిన తన పార్టీ అభ్యర్థులందరినీ ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించారు.కింగ్ మేకర్‌గా షిండే సేనమొత్తం 227 స్థానాలు ఉన్న బీఎంసీలో మెజారిటీకి 114 సీట్లు అవసరం. బీజేపీ 89 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించగా.. షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ 29 స్థానాలను గెలుచుకుంది. ఈ 29 మంది మద్దతు లేనిదే బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం అసాధ్యం. ఇదే అంశాన్ని షిండే వర్గం అస్త్రంగా చేసుకుంటోంది. పదవి శివసేన వారసత్వం.. కాబట్టి మేయర్ పీఠం మాకే దక్కాలని షిండే వర్గీయులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.ఫిరాయింపుల భయంమరోవైపు.. ప్రతిపక్షాలు (ఉద్ధవ్ సేన, కాంగ్రెస్, ఇతరులు) అందరూ కలిస్తే వారి బలం 106కు చేరుతుంది. అంటే మెజారిటీకి వారు కేవలం 8 స్థానాల దూరంలో మాత్రమే ఉన్నారు. షిండే వర్గం నుంచి ఒక 8 మందిని తమ వైపు తిప్పుకుంటే మళ్లీ అధికారం దక్కించుకోవచ్చని ఠాక్రే వర్గం వ్యూహాలు రచిస్తోంది. ఈ కార్పొరేటర్ల లాబీయింగ్ జరగకుండా ఉండేందుకే షిండే తన కార్పొరేటర్లను హోటల్‌కు తరలించినట్లు తెలుస్తోంది.థానే వర్సెస్ ముంబైమరోవైపు.. థానే మున్సిపల్ కార్పొరేషన్‍లో షిండే శివసేన ఒంటరిగానే మెజారిటీ సాధించింది. దీంతో థానేలో షిండే సేనకు మేయర్ పదవి ఇచ్చి.. ముంబైలో బీజేపీకి వదులుతారా లేక ముంబై మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్ల చొప్పున పంచుకుంటారా అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. మేయర్ పీఠం కోసం జరుగుతున్న ఈ అంతర్గత పోరు మహాయుతి కూటమిలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.