Price Hike: స్మార్ట్ ఫోన్, టీవీ, ల్యాప్ ట్యాప్ కొనుగోలు చేయాలనే ప్లాన్ చేస్తున్నారా? అయితే అలర్ట్, మీ జేబుపై అదనపు భారం పడనుంది. రాబోయే రెండు మూడు నెలల్లో ఆయా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యాప్ ధరలు కంపెనీలు పెంచుతున్న సంగతి తెలిసిందే. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) సంస్థల నుంచి మెమోరీ చిప్పులకు భారీగా డిమాండ్ పెరగడమే ఇందులు ప్రధాన కారణంగా కంపెనీలు చెబుతున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. గత త్రైమాసికంలో మెమోరీ చిప్స్ ధరలు ఏకంగా 50 శాతాని పైగా పెరగిన సంగతి తెలిసిందే. జనవరి- మార్చి త్రైమాసికంలో మరో 40 శాతం నుంచి 50 శాతం వరకు వీటి ధరల పెంపు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో మరో 20 శాతం మేర ధరలు పెరగవచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో వివో, నథింగ్ వంటి కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్ల ధరలను రూ.3 వేల నుంచి రూ.5000 వేరకు పెంచాయి. శాంసంగ్ వంటి పెద్ద సంస్థలు పరోక్షంగా ఖర్చులు తగ్గించుకునేందుకు క్యాష్ బ్యాక్‌లు, డిస్కౌంట్లను ఆపేశాయి. మెమోరీ చీప్స్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీలు ఆ మేరకు ధరలు పెంచవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మరిన్ని కంపెనీలు ఇదే బాటలో నడవవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. నవంబర్- డిసెంబర్ నెలల్లో స్మార్ట్ ఫోన్ ధరలు కనిష్ఠంగా 3 శాతం నుంచి గరిష్ఠంగా 21 శాతం వరకు పెరిగాయి. రాబోయే రోజుల్లో మరో 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు టీవీల కంపెనీలు సైతం అదే దారిలో నడుస్తున్నాయి. తాము ఆర్డర్ చేసే మెమోరీ చీప్స్‌లో కేవలం పదో వంతు మాత్రమే అందుతున్నాయని థామ్స్, కోడక్ వంటి బ్రాండ్లతో టీవీలు విక్రయించే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ కంపెనీ పేర్కొంది. మెమోరీ చిప్స్ కొరత ఈ పరిస్థితికి దారితీస్తోందని పేర్కొంది. ఇప్పటికే టీవీల ధరలు పెంచామని, ఫిబ్రవరి నెలలో మరో 4 శాతం మేర ధరలు పెంచాలనుకుంటున్నట్లు ఆ సంస్థ సీఈఓ అవనీత్ సింగ్ ఎకనామిక్ టైమ్స్ కు వెల్లడించారు. ల్యాప్ ట్యాప్ ధరలు ఇప్పటికే 5 శాతం నుంచి 8 శాతం పెరిగాయి. మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.