హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా.. ఓఆర్ఆర్ (ORR) లోపల నివసిస్తున్న సామాన్యుల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో.. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కొత్తగా 23 అత్యాధునిక ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలని నిర్ణయించారు. నగరంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ఒక చారిత్రాత్మక అడుగుగా నిలవనుంది.ఈ ప్రతిపాదిత 23 పాఠశాలల్లో 15 పూర్తిగా కొత్తవి కాగా.. మిగిలిన 8 ఇప్పటికే ఉన్న పాఠశాలలను అన్ని వసతులతో ఉన్నతీకరించనున్నారు. .. ఇక్కడ ప్రీ-ప్రైమరీ (LKG/UKG) నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్యనందిస్తారు. దీనివల్ల విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి కళాశాల విద్య వరకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఒకే చోట నాణ్యమైన విద్యను పొందవచ్చు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. ప్రతి పాఠశాలకు కనీసం ఒక ఎకరం స్థలం ఉండాలని నిబంధన విధించారు. ఆటస్థలం, అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ, డిజిటల్ క్లాస్‌రూమ్‌ల కోసం ఈ స్థలం తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ప్రస్తుతం గుర్తించిన పాఠశాలల్లో బాచుపల్లి, అమీర్‌పేట, మారేడుపల్లి, బండ్లగూడ-2, సరూర్‌నగర్, బాలాపూర్ మండలాల్లోని ఆరు ప్రాంతాల్లో స్థలం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లోని పాఠశాలల సమీపంలోనే కనీసం ఎకరం ప్రభుత్వ స్థలాన్ని వెంటనే గుర్తించి నివేదిక పంపాలని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.ఈ కొత్త పాఠశాలల నిర్మాణం పూర్తయితే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం నుంచి సామాన్యులకు ఇది పెద్ద ఊరటనిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరితగతిన నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది.