: బ్యాంకింగ్ సేవల్లో కస్టమర్లకు ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసేందుకు () కీలక నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత వేగంగా, సమర్థంగా మార్చేందుకు కీలక మార్పులు చేస్తోంది. బ్యాంకులతో పాటుగా ఇతర నియంత్రిత కంపెనీల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్- సమగ్ర అంబుడ్స్‌మన్ పథకం 2026ను తీసుకొస్తోంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2025కు కొన్ని మార్పులు చేస్తోంది. సవరణలతో కూడిన ముసాయిదాను శుక్రవారమే విడుదల చేసింది. అంబుడ్స్‌మన్ పథకం 2025లో చేస్తున్న మార్పుల ముసాయిదాపై ప్రజల నుంచి అభిప్రాయలను కోరుతోంది. ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాక, వాటిని క్రోడీకరించి నిబంధనలు ఖరారు చేయనుంది. ఫిర్యాదులు చేసే వారికి తక్కువ ఖర్చుతో వేగవంతమైన పరిష్కారాన్ని అందించడమే ఈ కొత్త పథకం లక్ష్యమని ఆర్‌బీఐ తెలిపింది. ఫిర్యాదుల విచారణలు క్లుప్తంగా ఉంటాయని, ఇవి సాధారణ సాక్ష్యాధారాల నిబంధనలకు లోబడి ఉండవని తెలిపింది. ఈ బాధ్యతలు నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ తన అధికారుల నుంచి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అధికారులను ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్, ఆర్‌బీఐ డిప్యూటీ అంబుడ్స్‌మన్‌లుగా నియమించనుంది. సాధారణంగా వీరి నియామక కాలపరిమితి ఒకేసారి ముడు సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిశీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఒకటి లేదా పలు చోట్ల సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీఆర్‌పీసీ)లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారా ఈజీగా సమర్పించే వీలుంటుంది. కొత్త విధానంలో వివాదానికి సంబంధించిన మొత్తంపై గరిష్ఠ లిమిట్ విధించలేదు. అంబుడ్స్‌మన్ లేదా డిప్యూటీ అంబుడ్స్‌మన్ ఆ వివాదాలపై రాజీ కుదర్చడం లేక తగిన తీర్పు ఇవ్వడం ద్వారా సమస్యలను పరిష్కరిస్తారు. బ్యాంక్ ఖాతాదారులకు కలిగిన నష్టాలకు సంబంధించి, గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు పరిహారం చెల్లించాలని ఆదేశించే అధికారం అంబుడ్స్‌మన్‌కు ఉంటుంది. అలాగే దీనికి అదనంగా మరో రూ. 3 లక్షల వరకు పరిహారం అందించే వీలుంటుందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాదిలో పాలసీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాల వడ్డీ రేట్లు సైతం భారీగా తగ్గాయి. ఇదే సమయంలో బ్యాంకులు డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గించాయి.