: స్టాక్ మార్కెట్లు వారంలో 5 రోజులు పనిచేస్తాయన్న సంగతి ఇన్వెస్టర్లకు తెలిసే ఉంటుంది. శని, ఆదివారాల్లో ఎప్పుడూ సెలవు ఉంటుంది. ఇంకా సెబీ, NSE క్యాలెండర్ ప్రకారం ప్రత్యేక ట్రేడింగ్ హాలిడేస్ ఉంటాయి. . ఇంకా.. స్టాక్ ఎక్స్చేంజీలు ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తాయి కాబట్టి అక్కడ ఏమైనా స్థానిక సెలవులు, పోల్స్ వంటివి ఉన్నా ఆరోజున స్టాక్ మార్కెట్లకు హాలిడే ప్రకటిస్తుంటారు. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో మరోసారి చాలా అరుదైన ఘట్టం చోటుచేసుకోబోతోంది. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా.. స్టాక్ మార్కెట్లు ఆదివారం కూడా తెరుచుకోనున్నాయి. ఎప్పుడో గానీ ఇలా జరిగి ఉండదు. అసలు ఆదివారం ఎందుకు స్టాక్ మార్కెట్లు ఓపెన్ అవుతున్నాయో తెలుసా..?ఫిబ్రవరి 1న ఆదివారం రోజు.. ఈసారి తెరుచుకోనుంది. ఈ రోజు ప్రత్యేకత గురించి మీకు కొంత వరకు తెలిసే ఉంటుంది. ఇది బడ్జెట్ డే. అవును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటు లోక్‌సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే క్రమంలో ఇన్వెస్టర్ల ప్రయోజనార్థం బాంబే స్టాక్ ఎక్స్చేంజీ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (NSE) కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. స్టాక్ మార్కెట్లు ఆదివారం రోజు కూడా తెరిచి ఉంటాయని ప్రకటనలు వెలువరించాయి. సాధారణంగానే బడ్జెట్ ప్రకటన రోజున స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. బడ్జెట్ ప్రకటనలకు అనుగుణంగా మార్కెట్లు వేగంగా ప్రతిస్పందిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆదివారం రోజు కూడా బడ్జెట్ సందర్భంగా పూర్తి స్థాయి ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నట్లు ఎక్స్చేంజీలు సర్క్యులర్ జారీ చేశాయి. దీంతో యథావిధిగానే ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. 9.08 గంటల వరకు ప్రీ ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. 9.15 గంటల నుంచి 3.30 గంటల వరకు సాధారణ ట్రేడింగ్ జరగనుంది. ఇక్కడ ఈక్విటీ, ఎఫ్ అండ్ ఓ, కమొడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లలో లావాదేవీలు యథావిధిగానే జరుగుతాయి. ఆదివారం సెటిల్మెంట్ సెలవు సందర్భంగా T+0 సెటిల్మెంట్ సెషన్, ఆక్షన్ సెషన్లు మాత్రం ఉండవు. భారత బడ్జెట్ చరిత్రలో ఇదో అరుదైన సందర్భంగా చెప్పొచ్చు. దాదాపు 26 సంవత్సరాల తర్వాత బడ్జెట్ ఆదివారం రోజు వచ్చింది. చివరిగా 2000 సంవత్సరంలో బడ్జెట్‌ను ఆదివారం రోజు ప్రవేశపెట్టారు. తర్వాత 2015, 2025లో శనివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ మార్కెట్లు పనిచేశాయి. ఇప్పుడు దశాబ్దాల తర్వాత ఆదివారం రోజున బడ్జెట్ వచ్చింది. దీంతో మార్కెట్లు పనిచేయనున్నాయి.