శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల కేటాయింపు విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకూ మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన అంగప్రదక్షిణం టోకెన్లను టీటీడీ కేటాయిస్తూ వచ్చింది. అయితే ఈ విధానం స్థానంలో టీటీడీ మార్పులు చేసింది. ఈ విధానానికి బదులుగా లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన విధానంలో భాగంగా తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్లు మూడు నెలల ముందే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ లెక్కన డిసెంబర్ నెల అంగ ప్రదక్షిణ టోకెన్లు సెప్టెంబర్ నెలలోనే విడుదల చేస్తారు. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 20 వరకు లక్కీడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు అంగప్రదక్షిణం టోకెన్లను టీటీడీ కేటాయించనుంది.మరోవైపు శుక్రవారాలు మినహా ప్రతిరోజూ 750 అంగ ప్రదక్షిణం టోకెన్లు, శనివారాల్లో 500 అంగ ప్రదక్షిణం టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గతంలో 90 రోజులు గడువు ఉండగా.. ప్రస్తుతం దానిని 180 రోజులుగా నిర్ణయించారు. భక్తులు ఈ మార్పును గమనించాలని టీటీడీ ప్రకటనలో కోరింది. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు మరోవైపు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవన్‌లో మంగళవారం టీటీడీ ఛైర్మన్ అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండు వరకూ జరగనున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం 7 గంట‌లకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. సెప్టెంబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సెప్టెంబ‌రు 25వ తేదీ పిఏసి- 5 శ్రీ వెంక‌టాద్రి నిల‌యాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు.2026వ సంవ‌త్సరం క్యాలెండ‌ర్లు, డైరీల‌ను ఆవిష్కరిస్తారు. మరోవైపు ఈసారి బ్రహ్మోత్సవాల కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ ఇస్రో సహకారం తీసుకోనుంది. ఇస్రో సౌజన్యంతో బ్రహ్మోత్సవాలలో క్రౌడ్ మేనేజ్‌మెంట్ మానిటరింగ్ చేపట్టనున్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకూ దివ్యాంగులు, వ‌యోవృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.