ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్.. ప్రమోషన్ కావాలంటే పాస్ అవ్వాల్సిందే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు పొందాలంటే పరీక్షలు తప్పనిసరి అన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పరీక్షలు పాసైతేనే పదోన్నతులు వస్తాయని.. ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశాలను ప్రస్తావించారు. కొత్త ఉద్యోగాల్లో ఐటీ నైపుణ్యాలు తప్పనిసరి అని తెలిపారు. ఉద్యోగంలో చేరిన తర్వాత శిక్షణ ఇవ్వడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులకు కూడా ఐటీపై అవగాహన ఉండాలని చంద్రబాబు అన్నారు. ఎవేర్‌ 2.0 ద్వారా 42 విభాగాల సమాచారం వెంటనే తెలుసుకోవచ్చని.. డేటా లేక్ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది అన్నారు. దీని ద్వారా పాలన సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని.. ఈ సాంకేతికతను ఉపయోగించి జీవోలు కూడా తయారు చేయొచ్చన్నారు. దీనివల్ల తప్పులు జరగడానికి అవకాశం ఉండదన్నారు. అధికారులు రాబోయే రెండు నెలల్లో అన్ని ఫైళ్లను ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు చంద్రబాబు. ఆ ఫైల్స్ జవాబుదారీతనం (ఎకౌంటబులిటీ) కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పారు. ఎవరు తప్పు చేసినా వెంటనే తెలుసుకోవచ్చని.. క్వాంటమ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తామన్నారు. ఇది రాష్ట్రానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరిగా అమలు కావడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాట్సాప్ ద్వారా 738 సేవలు అందుబాటులోకి తెచ్చినా.. రెవెన్యూ, పోలీస్, జైళ్లు, పురపాలక శాఖల్లో మార్పు రాలేదన్నారు. ప్రజలెవరూ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని.. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం కార్యాలయానికి రమ్మంటున్నారన్నారు. మీ సేవ కేంద్రాల్లో పనిచేసే వారిని ఔట్‌సోర్సింగ్‌ ద్వారా తీసుకుని, వాట్సాప్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. పోలీసు, జైళ్లు, పురపరిపాలన శాఖలు కూడా సేవలు అందించడం లేదన్నారు. ఈ శాఖలన్నింటిలో మార్పు రావాలన్నారు.డిసెంబర్ నాటికి కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీగా మారుస్తామన్నారు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని.. 2027 నాటికి పూర్తవుతాయని తెలిపారు. అంతేకాదు, డంపింగ్ యార్డుల్లోని పాత చెత్తను అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆగస్టు 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. దీనిని అమలు చేస్తున్నామని సురేష్ కుమార్ తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో కీలక విషయాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడపలలో వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే కొత్త ప్రాజెక్టులు రానున్నాయన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలలో భవన నిర్మాణ వ్యర్థాలను తిరిగి ఉపయోగించే ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామన్నారు. 142 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు 199 ఎకరాల స్థలం అవసరమని ఆయన తెలిపారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన 85.90 లక్షల టన్నుల పాత చెత్తను అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు.