తెలంగాణ ప్రజలకు జారీ అయ్యాయి. నేటి నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ, మహారాష్ట్ర పరిసరాల్లో బలహీనపడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ చేశారు. ఇక కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రోడ్లు నదులను తలపించాయి. ఈ వర్షాల వల్ల ముగ్గురు యువకులు గల్లంతు కాగా.. ఇప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ భయంకరమైన అనుభవాల నేపథ్యంలో వర్ష సూచన అంటేనే నగరవాసులు ఉలిక్కిపడుతున్నారు. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక బుధవారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నాలుగున్నర ప్రాంతంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అరగంటపాటు కురిసిన వర్షంతో నగర రహదారులు జలమయయ్యాయి. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి.