ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అర్బన్ 2.0 కింద 40,410 ఇళ్లను మంజూరు చేసింది. 2024-25 సంవత్సరానికి 31,719 ఇళ్లు, 2025-26కు మరో 8,691 ఇళ్లను కేటాయించింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో యూనిట్‌ (ఇంటి) విలువ రూ.2.50 లక్షలు కాగా.. ఇందులో కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష భరిస్తుంది. పేద ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు.రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను నిజం చేసేలా.. పేదలందరికీ ఇళ్ల కట్టిస్తామన్న హామీని నిలబెట్టుకోవడానికి చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే డబ్బును రూ.1.80 లక్షలకు తగ్గించింది. దీనివల్ల పేదల ఇళ్ల నిర్మాణం సరిగా జరగలేదు. అయితే గతంలో ఆగిపోయిన ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం కొత్తగా ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY-అర్బన్) 2.0 పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కొత్తగా మంజూరు చేసే ఇళ్లకు యూనిట్ వ్యయాన్ని రూ.2.50 లక్షలకు పెంచారు.రాష్ట్రంలోని పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లబ్ధిదారులకు రూ.2.90 లక్షల వరకు సాయం అందిస్తున్నాయి. PMAY-అర్బన్ 2.0 పథకం కింద తొలి విడతగా 40,410 ఇళ్ల నిర్మాణానికి రూ.1010.25 కోట్లు మంజూరు చేసింది. 2029 నాటికి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం తన వాటాగా రూ.1.50 లక్షలు ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో లక్ష రూపాయలు తన వాటాగా కలపనుంది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు 90 రోజులకు రూ.39 వేలు జమ కానున్నాయి. మొత్తంగా లబ్ధిదారులకు రూ.2.90 లక్షల వరకు ప్రభుత్వ సాయం అందుతుంది. ఇంటి నిర్మాణం కోసం ఇంకా డబ్బులు అవసరమైతే లబ్ధిదారులే పెట్టుకోవాలి. ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బి.శ్రీనివాసరావును ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి OSDగా ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 12న జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తారు. ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది.. దీని ప్రకారం బి.శ్రీనివాసరావు ఇకపై ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి OSDగా ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి కొత్త వైస్ ఛైర్మన్లను నియమించారు. నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ రత్నశీలమణి, ఎస్వీయూ ప్రొఫెసర్ విజయ భాస్కరరావులను నియమించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు మూడేళ్ల పాటు ఈ పదవుల్లో ఉంటారు. కొత్త వైస్ ఛైర్మన్లు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.