నెల్లూరులో ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఏడుగురు స్పాట్‌లోనే

Wait 5 sec.

నెల్లూరులో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా కారులోని ఏడుగురు మృతిచెందారు. కారును ఢీకొట్టిన తర్వాత కొంతదూరం వరకూ టిప్పర్ అలాగే లాక్కెళ్లింది. దీంతో కారులోని ఏడుగురు అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కారు సహా అందులోని ఏడుగురు నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి గురైన మారుతి ఫ్రొనెక్స్ ఏపీ 40 హెచ్జీ 0758 కారు.. నెల్లూరు నుంచి కడప జిల్లా బద్వేల్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ, అప్పటికే కారులోని ఉన్నవారంతా మృతిచెందినట్టు గుర్తించారు. టిప్పర్ లారీ రాంగ్ రూట్‌లో వచ్చి.. ఎదురుగా వస్తోన్న కారును అతివేగంగా ఢీకొట్టింది. దీంతో కారు సగభాగం లారి ముందు భాగంలోకి చొచ్చుకెళ్లింది. ప్రమాద స్థలిలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఘటనా స్థలిలో పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు. కారులోపల ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కారు ముందు భాగం టిప్పర్‌లో దూరడంతో వేరుచేయడానికి క్రేన్‌ను రప్పిస్తున్నారు.