ఇళయరాజా... భారతీయ సినిమా చరిత్రలో ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. గత ఐదున్నర దశాబ్దాలుగా ఆయన తన పాటలతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. ఆయన సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. అయితే మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా.. తన పాటల కాపీరైట్‌ల విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. తన అనుమతి లేకుండా చిన్న ట్యూన్ వాడినా కోర్టులో పిటిషన్ వేస్తుంటారు. తన పాటలను ఎవరూ వాడకూడదని, వాడితే కేసులు పెడతానని చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తన స్నేహితులపై కేసులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆయన అజిత్ కుమార్ సినిమాకి షాక్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ'. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సమ్మర్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. అయితే అనుమతి లేకుండా తన పాటలను సినిమాలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఇళయరాజా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది కాపీరైట్‌ చట్టానికి విరుద్ధమని, వెంటనే ఆ సాంగ్స్ తొలగించాలని, పాటలు ఉపయోగించినందుకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.ఇళయరాజా పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు.. ఆయన పాటలను 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అజిత్‌ కుమార్‌ సినిమాని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నుంచి తొలగించారు. అయితే ఇండియాలో స్ట్రీమింగ్ నిలిపివేసినప్పటికీ, అమెరికాతో సహా పలు దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' వివాదంపై చిత్ర నిర్మాత మైత్రీ రవి ఇటీవల స్పందించారు. తాము విడుదలకు ముందే అన్ని పర్మిషన్లు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగా సాంగ్స్ ఉపయోగించామమని తెలిపారు. కానీ ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మేకర్స్ ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.