ఆసియాకప్ 2025 లీగ్ స్టేజ్‌లో భారత బౌలింగ్ ముందు తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్లు.. టీమిండియా ఆటగాళ్లు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో సూపర్‌-4 మ్యాచ్‌లో రాణించారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. తొలుత పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆసియాకప్ 2025లో తొలి మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయిన సయీమ్ ఆయూబ్‌ ఈసారి ఓపెనింగ్‌ స్థానంలో బ్యాటింగ్‌కు రాలేదు. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చాడు.ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో పాక్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫకర్ జమాన్ (15) పెవిలియన్ చేరాడు. అయితే మరోవైపు ఫర్హాన్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా సిక్స్‌లు బాదాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో కౌంటర్ ఎటాక్ చేశాడు. దీంతో పాకిస్థాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఓ దశలో పాకిస్థాన్.. 10.2 ఓవర్లలో 93/1తో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో 200 రన్స్ చేసేలా కనిపించింది ఆ జట్టు.కానీ ఈ సమయంలో శివమ్ దూబే.. వరుస ఓవర్‌లలో వికెట్లు తీశాడు. దీంతో పాకిస్థాన్ స్కోరు బోర్డు నెమ్మదించింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు క్యాచ్‌లు మిస్ చేయడం కూడా పాక్ బ్యాటర్లకు కలిసొచ్చింది. ఫర్హాన్‌ రెండు సార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పరుగుల ఖాతా తెరవకుండానే ఓసారి.. ఆపై మరోసారి అతడి క్యాచ్‌ను అభిషేక్ శర్మ మిస్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడు.. 45 బంతుల్లో 58 రన్స్ చేసి పాక్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చివర్లో ఫహీమ్ అష్రప్ (8 బంతుల్లో 20 రన్స్‌) బ్యాట్ ఝుళిపించడంతో పాకిస్థాన్ స్కోరు 170 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు.. 5 వికెట్ల నష్టానిక 171 పరుగులు చేసింది. భారత్ ముందు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిలిపింది. భారత బౌలర్లలో శివమ్ దూబె రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లు వేసి.. 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.