భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఏకే-47 తుపాకీ కాల్పుల సెలబ్రేషన్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..!

Wait 5 sec.

ఆసియాకప్‌ 2025లో భారత్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ చేసుకున్న సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత విస్మయం గొలిపే రీతిలో సంబరాలు చేసుకున్నాడు. బ్యాట్‌ను ఏకే 47 గన్ తరహాలో పట్టుకుని.. దాన్ని పేల్చినట్లు ఫోజులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది పాకిస్థాన్. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఫకర్ జమాన్ ఔట్ అయినా.. ఫర్హాన్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఎడా పెడా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ.. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి.. 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత ఫర్హాన్.. తన బ్యాట్‌ను ఏకే 47 గన్ తరహాలో పట్టుకున్నాడు. గన్‌తో గాల్లో కాల్పులు జరిపినట్లు.. మూడు సార్లు తుపాకీ పేల్చినట్లు ఫోజులు ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో ఉద్దేశపూర్వకంగానే భారత ఫ్యాన్స్ వైపు చూస్తూ ఫర్హాన్ ఇలా చేశాడని పేర్కొంటున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఇది పూర్తిగా రెచ్చగొట్టే చర్య అని.. దీనిపై ఐసీసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం.. పాకిస్థాన్‌ను అందరూ ఉగ్రవాదుల ఉండే దేశం అని ఎందుకు అంటారో.. మరోసారి రుజువైందని చురకలు అంటిస్తున్నారు. పాకిస్థాన్ బ్యాటర్.. బ్యాట్ పట్టుకుని తుపాకీ పట్టుకున్నట్లు ఫీల్ అవుతున్నాడని కౌంటర్‌లు వేస్తున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో ఫర్హాన్.. 45 బంతుల్లో 58 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 171 రన్స్ స్కోరు చేసింది.పాక్ బ్యాటర్ సెలబ్రేషన్స్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను గుర్తు చేశాయని.. అమాయకులైన భారత పర్యాటకుల ప్రాణాలను ఉగ్రవాదులు బలి తీసుకున్న తీరుగానే.. కాల్పులు జరుపుతున్నట్లు పాక్ ఆటగాడు సంబరాలు చేసుకున్నారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటానికి అనుమతి ఇస్తే.. ఆ దేశ ఆటగాళ్లు మాత్రం మనకు పహల్గామ్ దాడి ఘటనను గుర్తు చేస్తున్నారని.. అందుకే ధూర్త పాకిస్థాన్‌తో ఆటలేవీ ఆడొద్దని డిమాండ్ చేస్తున్నారు.పాకిస్థాన్ అభిమానులు మాత్రం రఫెల్ యుద్ధ విమానాన్ని కాల్చినట్లుగా ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయని తమ క్రికెటర్‌ వీడియోను షేర్ చేసి మురిసిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్.. పాక్ బౌలర్లను తుక్కుతుక్కుగా కొడుతూ భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.