రేపటి నుంచే కొత్త జీఎస్టీ రేట్లు.. ప్రజలకు కేంద్రం కీలక సూచన.. ఫిర్యాదులకు హెల్ప్‌లైన్

Wait 5 sec.

GST Cut: సవరించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి వస్తున్న క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ రేట్లకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసేందుకు హెల్ప్ లైన్ విభాగం ఏర్పాటు చేసింది. జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ (NCH)లోని ఇన్‌గ్రామ్ పోర్టల్‌లో చేసినట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 3వ తేదీన జరిగిన జీఎస్టీ మండలి 56వ సమావేశంలో తదుపరి తరం జీఎస్‌టీ సంస్కరణలను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ జీఎస్టీ కొత్త రేట్లు 2025, సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 22వ తేదీ నుంచి అమలులోకి రానున్న సవరించిన వస్తు సేవల పన్ను రేట్లు, మినహాయింపులు అమలు చేసిన తర్వాత ఎన్‌సీహెచ్‌పై వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు, ప్రశ్నలను పరిష్కరించేందుకు ఇన్‌గ్రామ్ (ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం) పోర్టల్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించినట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ విభాగంలో వాహన, బ్యాంకింగ్, మన్నికైన వినిమయ ఉత్పత్తులు, ఎఫ్ఎంసీజీ, ఇ- కామర్స్ సహా ఇతర ప్రధాన ఉప విభాగాలు ఉంటాయి. ఫిర్యాదులు, ప్రశ్నలు ఏ ఉప విభాగానికి చెందినవి అయితే అక్కడ జీఎస్టీ సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నాయి. ఈ నెల 11వ తేదీన కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం (CBIC) అధికారులు ఎన్‌సీహెచ్‌ కౌన్సిలర్లకు జీఎస్టీకి సంబంధించిన ఫిర్యాదులు, ప్రశ్నలను ప్రభావ వంతంగా ఎలా నిర్వహించాలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక 5, 18 శాతం జీఎస్టీ శ్లాబులను మాత్రమే కొనసాగిస్తున్నారు. అయితే, లగ్జరీ వస్తువులు, హానికర ఉత్పత్తులపై 40 శాతం కొత్త శ్లాబ్ తీసుకొస్తున్నారు. అయితే, 28 శాతం, 12 శాతం శ్లాబుల్లో ఉన్న చాలా వస్తువులు, నిత్యావసర సామగ్రి ధరలు భారీగా తగ్గుతాయని కేంద్రం చెబుతోంది. సెప్టెంబర్ 22 తర్వాత పాత వస్తువులు సైతం తగ్గించిన ధరలతోనే విక్రయించాలని తెలిపింది. అయితే, పాత వస్తువులపై కొత్త రేట్లతో స్టిక్కర్లను వేయనున్నారు. కానీ, చాలా వరకు దుకాణాల్లో పాత రేట్లతోనే విక్రయించే ప్రమాదం ఉంది. ఈ విషయంపై ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్‌లైన్ పోర్టల్ ఉపయోగించుకోవచ్చు.