సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కమెడియన్ రోబో శంకర్ కన్నుమూత..

Wait 5 sec.

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూశారు. రెండో రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శంకర్ వయసు 46 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా ఆయన కామెర్ల సమస్యతో బాధపడుతున్నారు. చెన్నైలో మంగళవారం ఓ సినిమా షూటింగ్ సమయంలో స్పృహతప్పి పడిపోవడంతో శంకర్‌ను ఓ హాస్పిటల్ కి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించి గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి తుదిశ్వాస విడిచారు. రోబో శంకర్ సినిమాల్లోకి రాకముందు ఓ టీవీ ఛానెల్‌లో మిమిక్రీ కార్యక్రమం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. తన స్టాండప్ కామెడీతో బుల్లితెరపై నవ్వులు పూయించిన ఆయన.. రోబో తరహాలో డ్యాన్స్ చేయడం ద్వారా 'రోబో శంకర్‌'గా గుర్తింపు పొందారు. సినీ రంగంలో అడుగుపెట్టిన తర్వాత, కెరీర్ ప్రారంభంలో పెద్దగా గుర్తింపులేని చిన్న చిన్న పాత్రల్లో నటించారు. 'చెన్నై కాదల్' 'దీపావళి' వంటి సినిమాల్లో కాస్త స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్రల్లో నటించి అలరించారు. 'నేనేరా మహేష్', 'విశ్వాసం', 'పులి', 'మాయ', 'త్రిష లేదా నయనతార', 'సింగం 3', 'కోబ్రా', 'అభిమన్యుడు', 'మారి' వంటి డబ్బింగ్ చిత్రాలతో రోబో శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తనదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. ఆయనకు భార్య ప్రియాంక శంకర్, కుమార్తె ఇంద్రజ ఉన్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన 'విజిల్' సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా ఇంద్రజ నటించింది. 'పాగల్' సినిమాలో విశ్వక్ సేన్ ని ప్రేమించి బ్రేకప్ చెప్పే పాత్రలో కనిపించింది.రోబో శంకర్ మృతికి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఎమోషనల్ అవుతున్నారు. కమల్ హాసన్, రాఘవ లారెన్స్, విష్ణు విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్, సిమ్రాన్, డైరెక్టర్ వెంకట్ ప్రభు తదితరులు సంతాపం ప్రకటించారు. ''రోబో శంకర్ ఒక పేరు మాత్రమే, నాకు నువ్వు తమ్ముడివి. నన్ను వదిలి ఎలా వెళ్లిపోయావ్? నీ పని పూర్తయింది.. నువ్వు వెళ్ళిపోయావు. కానీ నా పని ఇంకా మిగిలే ఉంది'' అంటూ కమల్ హాసన్ పోస్ట్ పెట్టారు.రోబో శంకర్ మృతదేహాన్ని చెన్నై వలసరవక్కంలోని ఆయన నివాసానికి తరలించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి.