ఇంకో పది నిమిషాల్లో జైలు.. ఇంతలోనే ఎంత ప్లానేశాడు.. ఏపీ పోలీసులకు షాకిచ్చిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.!

Wait 5 sec.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. ఎస్కార్ట్ పోలీసుల నుంచి తప్పించుకుని బత్తుల ప్రభాకర్ పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బత్తుల ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోనూ బత్తుల ప్రభాకర్ కోసం పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 బృందాలు బత్తుల ప్రభాకర్ కోసం గాలిస్తున్నాయి. పది మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 40 మంది వరకూ కానిస్టేబుల్స్ ఇతర సిబ్బందితో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందాన్ని హైదరాబాద్‌కు కూడా పంపించినట్లు కొవ్వూరు పోలీసులు వెల్లడించారు.*ఎవరీ బత్తుల ప్రభాకర్..?చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ మీద తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 42 కేసులు ఉన్నాయి. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోనూ మనోడిపై 44 కేసులు ఉన్నట్లు తెలిసింది. బత్తుల ప్రభాకర్ విద్యాసంస్థలు, ఆసుపత్రులను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ ఉంటాడు. తెలుగు రాష్ట్రాలలో పాటుగా పొరుగు రాష్ట్రాలలోనూ చోరీలకు పాల్పడుతూ అంతర్రాష్ట దొంగగా మారాడు. గతంలోనూ ఇలాగే పోలీసులకు చిక్కినట్లు చిక్కి తప్పించుకుని పారిపోయిన చరిత్ర మనోడికి ఉంది. *అసలేం జరిగింది..అయితే ఇన్ని కేసులు ఉన్న బత్తుల ప్రభాకర్ ఇటీవల పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచగా.. కోర్టు రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే బత్తుల ప్రభాకర్‌తో పాటుగా మరో ఇద్దరు గంజాయి నిందితులను పోలీసులు సోమవారం ఉదయం విజయవాడ కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం సోమవారం రాత్రి తిరిగి తీసుకువస్తుండగా.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు వద్ద బత్తుల ప్రభాకర్‌ తప్పించుకుని పారిపోయాడు. బత్తుల ప్రభాకర్‌తో పాటుగా మరో ఇద్దరు నిందితులను ఓ ఏఎస్సై, ఇద్దరు ఎస్కార్ట్‌ సిబ్బంది తరలిస్తున్న సమయంలో బత్తుల ప్రభాకర్ తప్పించుకుని పారిపోయాడు.*ఇద్దరు నిందితుల చేతులకు సంకెళ్లు వేసిన పోలీసులు.. బత్తుల ప్రభాకర్ రెండు చేతులకు కలిపి సంకెళ్లు వేసినట్లు తెలిసింది. అయితే దుద్దుకూరులో రహదారి పక్కన ఉన్న ఓ హోటల్ వద్ద వాహనం ఆపారు. ఈ సమయంలోనే మూత్రం వస్తుందని బత్తుల ప్రభాకర్‌ పోలీసులకు చెప్పాడు. దీంతో ప్రభాకర్ కుడి చేతి సంకెళ్లను పోలీసులు తొలగించారు. ఇదే అదనుగా ప్రభాకర్ సమీపంలోని పొలాల్లోకి దూకి పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇంకో పది నిమిషాల్లో జైలుకు చేరుకుంటామనగా.. ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం బత్తుల ప్రభాకర్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో గాలిస్తున్నారు.