Investment: సంపాదిస్తున్న సమయంలోనే భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. పెళ్లి, పిల్లలు, వారి చదువులు, వారి పెళ్లిళ్లు అంటూ పెద్ద మొత్తంలో డబ్బులు కావాల్సిన అవసరాలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని తీర్చేందుకు తగిన విధానంలో తగినంత పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. ప్రస్తుత కాలంలో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇక రిస్క్ తీసుకోలేని వారు బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు పథకాలు, బాండ్ల వంటి వాటిని ఎంచుకుంటుంటారు. అయితే, ఏది ఎంచుకున్నా తమ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక అవసరాలను తీర్చవచ్చని, ఒత్తిడి లేకుండా ఉంటుందంటున్నారు. ద్రవ్యోల్బణం ప్రతి ఏటా భారీగా పెరుగుతున్న క్రమంలో దానికి తగినట్లుగా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు. మరి ఓ వ్యక్తి తన వద్ద ఉన్న డబ్బులతో కోటీశ్వరుడు కావాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రశ్న: ఇప్పుడు నాకు ఎలాంటి అప్పులు లేవు. నా చేతిలో రూ.10 లక్షలు ఉన్నాయి. వీటితో వచ్చే 10-12 సంవత్సరాల్లో రూ.1 కోటి సంపాదించాలని అనుకుంటున్నాను. ఈక్విటీ పెట్టుబడులు చేయగలను. అగ్రెసివ్ పోర్టిఫోలియోకు ప్రాధాన్యత ఇస్తాను. దీని ప్రకారం నాకు అనువైన ఒక ప్రణాళికను సూచించగలరు?సమాధానం: మీ పిల్లల చదువుల కోసం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉపయోగపడడం చాలా సంతోషం. రూ.10 లక్షల పెట్టుబడి ద్వారా వచ్చే 10 సంవత్సరాల్లో రూ.1 కోటి కార్పస్ ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు మీ పెట్టుబడిపై వార్షిక రాబడి (CAGR) 26 శాతంగా ఉండాలి. అయితే, ఇది సాధ్యం కాకపోవచ్చు. అయితే, అగ్రెసివ్ ఈక్వటీ ఆధారిత మ్యూచవల్ ఫండ్ల ద్వారా 12 ఏళ్ల పాటు వార్షిక రాబడి సీఏజీఆర్ 21 శాతం, 15 సంవత్సరాల పాటు 17 శాతం రాబడి అందుకునేందుకు అవకాశం ఉంది. రాబడులు అనేవి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయనే దానిపైనా ఆధారపడి ఉంటాయి. ఇటీవలి మార్కెట్ కరెక్షన్ తర్వాత లార్జ్ క్యాప్ పెట్టుబడుల విలువ లాంగ్ టర్మ్ సగటుకు దగ్గరగా ఉన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెట్టుబడుల విలువ లాంగ్ టర్మ్ సగటు కన్నా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లార్జ్ క్యాప్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న 3-4 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో ఫండ్ మేనేజర్లు విభిన్న మార్కెట్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఉంటుంది. భవిష్యత్తు సామర్థ్యం, అవకాశాల ఆధారంగా ఫండ్స్ ఎంచుకుంటారు. మీరు 12 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే దానిపై 21 శాతం వార్షిక రాబడి వచ్చినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.