ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఆ రైతులకు తీపికబురు చెప్పింది. రాజధాని కోసం అసైన్డ్‌ భూములిచ్చిన రైతులకు ఊరట దక్కేలా.. వారికి ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్లలో అసైన్డ్‌ అని లేకుండా చర్యలు తీసుకున్నారు. అసైన్డ్‌ అనే పదం తీసి పట్టా భూమి అని పేర్కొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించగా.. అసైన్డ్‌ భూమిలో రిటర్నబుల్‌ ప్లాట్‌ వస్తే పట్టా భూమిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ మేరకు జీ.వో. నెం.187ను (ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్ ను మారుస్తూ) పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ విడుదల చేశారు. గతంలో సీఆర్డీయేకు భూములు ఇచ్చినవారికి రిటర్నబుల్‌ ప్లాట్లలో అసైన్డ్‌ అని ప్రభుత్వం పేర్కొంది.. అసైన్డ్‌ అని ఉండటంతో తమ ప్లాట్లు అమ్ముడుపోవట్లేదని ప్రభుత్వానికి రైతులు తెలిపారు.. వెంటనే స్పందించిన చంద్రబాబు పట్టా భూమిగా మార్చాలని ఆదేశించడంతో.. అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో అసైన్డ్ భూముల రైతులు వారికి ఇచ్చిన ఫ్లాట్లను ఇతరులకు అమ్ముకునేందుకు వీలు కలిగింది. మరోవైపు రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సహకరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొందరికి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదని.. CRDA పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని రైతులు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లపై రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఒప్పుకోలేదు. మార్గదర్శకాలు లేవని, తనఖా పెట్టడానికి వీలు లేదని బ్యాంకర్లు తేల్చి చెప్పారు. రుణాలు ఇవ్వడానికి సరైన రూల్స్ లేవని.. ఆ ప్లాట్లను తనఖాగా కూడా తీసుకోడానికి ఒప్పుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యను సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ ఏడాది జూలై 25న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఆ సమయంలో రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. అయితే రైతులు బ్యాంకులకు వెళ్లగా.. అక్కడ సిబ్బంది రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. ప్రభుత్వం ఆదేశాలు ఉన్నా, బ్యాంకులు మాత్రం పాత కారణాలే చెబుతున్నాయి. దీంతో అమరావతి రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు.. ఏపీ ప్రభుత్వం వారి సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోంది. మరి బ్యాంకు రుణాల అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.