టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉన్న ఆ నియోజకవర్గానికి కొత్తగా ఇంఛార్జ్‌ను నియమించింది. మరోసారి మహిళా నేతకు అవకాశం కల్పించింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి, మాజీ ఎంపీపీ వైకుంఠం ప్రసాద్‌ సతీమణి వైకుంఠం జ్యోతిని అధిష్ఠానం నియమించింది. ప్రస్తుతం ఇంఛార్జ్‌‌గా ఉన్న వీరభద్ర గౌడ్‌ను బాధ్యతల నుంచి టీడీపీ తప్పించింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. వైకుంఠం కుటుంబం టీడీపీలో మొదటి నుంచి కొనసాగుతోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో వైకుంఠం కుటుంబం టికెట్ ఆశించినా దక్కలేదు. ఆలూరు నియోజకవర్గంలో అందర్ని కలుపుకుని టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని ఇంఛార్జ్ తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో వైకుంఠం శ్రీరాములు కుటుంబానికి టీడీపీతో అనుబంధం ఉంది. 1982లో టీడీపీ ఆవిర్భావం నుండి ఆ కుటుంబం పార్టీలో ఉంది. 1985లో వైకుంఠం శ్రీరాములు కుమారుడు చిప్పగిరి ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైకుంఠం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. 1983, 1987 (ఉప ఎన్నిక), 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం వైకుంఠం కుటుంబం కృషి చేసింది. 2006లో వైకుంఠం శ్రీరాములు దంపతులు హత్యకు గురయ్యారు.. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 2011లో వైకుంఠం ప్రసాద్ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రసాద్ టికెట్ ఆశించినా వీరభద్రగౌడ్‌కు అవకాశం రాలేదు. అధిష్ఠానం వీరభద్రగౌడ్‌కు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా, నియోజకవర్గం ఇన్‌చార్జిగా కొనసాగారు. 2019లో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పోటీ చేసినా ఓడిపోయారు. ఆమె ఓడిపోయినా ప్రతిపక్షంలో పార్టీ ఇంఛార్జ్‌గా కొనసాగారు. 2024 ఎన్నికల్లో మళ్లీ వీరభద్రగౌడ్‌కు టికెట్ ఇచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గెలిచినా, ఆలూరులో మాత్రం ఓడిపోయింది. ఓటమి తరువాత వీరభద్ర గౌడ్ ఏడాది పాటు పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అయితే ఇటీవల ఆలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా ఇంఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగ రాజు, ఆర్టీసీ కడప రీజన్‌ చైర్మన్‌ పూల నాగరాజులతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఆలూరు నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా టీడీపీ విజయం సాధించలేదు. అక్కడ వైకుంఠం, కోట్ల, వీరభద్రగౌడ్‌, గుమ్మనూరు జయరాం వర్గాలు ఉన్నాయి. దివంగత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడి కుటుంబం కూడా ఉంది. దీంతో ఆలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు వైకుంఠం జ్యోతి. 2029లో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు.ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. 'మా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ నాపై ఎంతో నమ్మకంతో ఆలూరు టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. వారి నమ్మకాన్ని తప్పకుండా నిలబెడుతాను. నాకు వర్గాలతో సంబంధం లేదు, పార్టీ నిర్ణయాలే శిరోధార్యం' అన్నారు. దివంగత కేడీసీసీబీ మాజీ చైర్మన్‌ వైకుంఠం శ్రీరాములు ఆశయాలను నెరవేరుస్తామని.. టీడీపీ కార్యకర్తల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరినీ కలుపుకొని 2029లో ఆలూరులో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కార్యకర్తలు, మండల నాయకులు తనను స్వేచ్ఛగా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని వలసలు, తాగునీటి సమస్యల నివారణకు కృషి చేస్తానన్నారు వేదావతి ప్రాజెక్టును పూర్తి చేయడమే తన ప్రథమ లక్ష్యమని.. తనకు ఈ బాధ్యతలు ఇచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.