రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన హైదరాబాద్‌కు చెందిన ఓ బాలుడ్ని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు ఏలూరు పోలీసులు. రెండు రోజుల క్రితం ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ CI సుబ్బారావు ఏలూరు శనివారపుపేటలోని బాలుర వసతి గృహానికి వెళ్లారు.. అక్కడ పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆ బాలుడుతన పేరు ఇబ్రహీం అని.. తన తండ్రి పేరు అక్రమ్ అని, వాళ్ల ఇల్లు హైదరాబాద్‌లోని బోరబండ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందని పోలీసులకు తెలిపాడు. తాను రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వచ్చేశానని పోలీసులకు చెప్పాడు.ఇబ్రహీం తల్లిదండ్రులతో గొడవ కారణంగా రైలు ఎక్కి గుంటూరు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే అతడ్ని విజయవాడలోని ఒక రెస్క్యూ హోమ్‌లో చేర్పించారు. ఆ తర్వాత ఏలూరుకు తీసుకువచ్చారు.. అతను హాస్టల్‌లో ఉంటూ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఏలూరు పోలీసులు ఆ అబ్బాయి ఫోటోను హైదరాబాద్ పోలీసులకు పంపారు. వాళ్లు ఆ ఫోటోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అప్పటికే ఆ అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఫోటో చూడగానే వాళ్ళు ఇబ్రహీంను గుర్తు పట్టారు.. వెంటనే ఏలూరుకు చేరుకున్నారు. ఆ బాలుడ్ని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. రెండేళ్ల తర్వాత కొడుకు తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. పోలీసులు చొరవ తీసుకుని ఆ అబ్బాయిని క్షేమంగా ఇంటికి చేర్చడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీం ఆచూకీ కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించిన ఏలూరు పోలీసులపై మంత్రి ప్రశంసలు కురిపించారు. 'రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఇబ్రహీం ఏలూరు పోలీసుల సహకారంతో తిరిగి తన తల్లి, సోదరుడిని కలవడం ఆనందంగా ఉంది. కిడ్నాప్ తర్వాత ఆ చిన్నారి తన చిరునామాను మర్చిపోయాడు. ఏలూరు పోలీసుల సహకారంతో ఇటీవల అతను ఏలూరు హోమ్‌కు బదిలీ అయ్యాడు. ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా ఏలూరు పోలీస్ శక్తి టీమ్ హైదరాబాద్‌కు వెళ్లి అతని కుటుంబాన్ని గుర్తించి, ఇబ్రహీంను వారికి అప్పగించారు. ఎట్టకేలకు చిన్నారి అడ్రస్ కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఏలూరు పోలీసులకు నా ప్రత్యేక అభినందనలు' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.