తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, అదే సమయంలో పనులలో జాప్యం లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎన్‌హెచ్ఏఐ, ఎన్‌హెచ్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఆర్‌అండ్‌బీ, అటవీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై సీఎం ఆరా తీశారు. ముఖ్యంగా చిన్న కారణాలతో ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, బాధితులకు తక్షణమే పరిహారం అందేలా చూడాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూసేకరణ, పరిహారం పంపిణీలో అక్టోబరు నెలాఖరు వరకు గడువు విధించారు. ఈ విషయంలో అలసత్వం వహించే అధికారులు, కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంలో కేంద్రం కొత్త సమస్యలు సృష్టిస్తోందని ముఖ్యమంత్రి ఎన్‌హెచ్ఏఐ అధికారులను ప్రశ్నించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాలను వేర్వేరు ప్రాజెక్టులుగా చూడకుండా.. ఒకే ప్రాజెక్టుగా పరిగణించి ఒకే నంబరు కేటాయించాలని ఆయన కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్ అలైన్‌మెంట్‌కు తక్షణమే ఆమోదం తెలిపి, ఏకకాలంలో రెండు భాగాల పనులు ప్రారంభించాలని సూచించారు. 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుతో 70 కిలోమీటర్లు తగ్గుతుందని, ఇది అత్యంత రద్దీ, ఆదాయం తెచ్చిపెట్టే ప్రాజెక్టు అవుతుందని వివరించారు. ఈ హైవేకు సమాంతరంగా రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని కోరారు. బెంగళూరు - శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ - అమరావతి మధ్య రైలు మార్గం అవసరాన్ని అధికారులకు వివరించారు. అంతేకాకుండా హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో రావిర్యాల - మన్ననూరు ఎలివేటెడ్ కారిడార్‌కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. శ్రీశైలం దేవాలయం, రిజర్వాయర్, టైగర్ ఫారెస్ట్ కారణంగా ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుందని వివరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా సీఎం సమీక్షించారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ భూమిని అటవీ పెంపకానికి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్‌తో స్వయంగా చర్చిస్తానని చెప్పారు. హైద‌రాబాద్‌ - మ‌న్నెగూడ మార్గంలో మ‌ర్రి చెట్ల తొల‌గింపున‌కు సంబంధించిన ఎన్జీటీ కేసును పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొ్న్నారు.