తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి టీటీడీ డిసెంబర్ నెల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు.. ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి భక్తులు వారి దర్శన టికెట్లతో పాటుగా వసతి గదుల్ని టీటీడీ వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in బుక్ చేసుకోవాల‌ని కోరింది టీటీడీ.'దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబ‌రు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సదరు రోజులలో ప్రతిరోజూ ఉదయం 11 గం.ల నుండి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 07 గం.లకు వాహన సేవలు ప్రారంభం కాగా,28వ తేదీ గరుడ వాహనంపై 05.00 గం.లకు స్వామి, అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు' అన్నారు.'ఈ సందర్భంగా సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, 23వ తేదీ శేష వాహనం, 24వ తేదీ చిన్న ప్రభ వాహనం, 25వ తేదీ హనుమంత వాహనం, 26వ తేదీ గరుడ వాహనం, 27వ తేదీ ముత్యపు పందిరి వాహనం, 28వ తేదీ గరుడ వాహనం, 29వ తేదీ తిరుచ్చి వాహనం, 30వ తేదీ సర్వభూపాల వాహనం, అక్టోబర్ 01వ తేదీ చిన్న శేష వాహనం, అక్టోబర్ 02వ తేదీ అశ్వవాహనంపై స్వామి, అమ్మవారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు' అని టీటీడీ తెలిపింది. 'అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న FIFO (First In First Out) పద్ధతి స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18వ లేది నుండి 20వ తేది వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు. శుక్రవారాలు మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 90 రోజుల బదులు 180 రోజులుగా నిర్ణయించడం జరిగింది. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.