తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరింత బలపడుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో విస్తారంగా, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుండగా.. ఇప్పుడు మరింత తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎదురుకానున్నాయి.తెలంగాణలో మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నేడు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో వందల కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. బంజారాహిల్స్‌లో అత్యధికంగా 10.3 సెం.మీ. వర్షం కురవగా.. శ్రీనగర్‌ కాలనీలో 9.7 సెం.మీ., ఖైరతాబాద్‌లో 8.33 సెం.మీ. వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 16 సెం.మీ. వర్షం కురవడం వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది. హైదరాబాద్ నగరంలో నేడు సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఈ అల్పపీడనం ఇక్కడితో ఆగిపోదని.. ఈ నెల 25న తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 27న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ బలమైన వాయుగుండం తీరం దాటే సమయంలో తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.