దిగ్గజ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఒక్క రోజులోనే ఖాతాలోకి డబ్బు.. అక్టోబర్ 4 నుంచే కొత్త రూల్స్

Wait 5 sec.

Cheque Clear Same Day: ప్రైవేట్ రంగంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. అక్టోబర్ 4, 2025 నుంచి కొత్త రూల్స్ అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఆ రోజు నుంచి చెక్ క్లియరెన్స్ మరింత వేగంగా పూర్తి చేయనున్నట్లు తెలిపింది.అంటే చెక్ డిపాజిట్ చేసిన రోజునే అకౌంట్లో జమ చేస్తారు. చెక్కులను వేగంగా ప్రాసెస్ చేసి క్లియర్ చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ మేరకు తమ కస్టమర్లకు ఇ-మెయిల్ ద్వారా సేమ్ డే చెక్ క్లియరింగ్ విషయాన్ని తెలియజేస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్. సంబంధిత బ్యాంక్ బ్రాంచులో చెక్కులు డిపాజిట్ చేసిన క్రమంలో వాటికి కట్-ఆఫ్ టైమ్ అదే రోజు ఉంటుందని తెలిపింది. తాజా నిర్ణయంతో ఖాతాదారులకు వేగంగా డబ్బులు చేతికి వస్తాయని, గొప్ప సౌకర్యవంతంగా ఉంటుందని, చెక్ క్లియరెన్స్ సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. అయితే, ఒకే రోజులో చెక్ క్లియరెన్స్ కావాలంటే ఖాతాదారులు చెక్కులను ఎలాంటి తప్పులు లేకుండా జారీ చేయాలని కోరింది. అలాగే అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. ' ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం మోసపూరిత చెక్కు ట్రాన్సాక్షన్లను అరికట్టేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లు పాసిజివ్ పే ఫీచర్స్‌ చేయాలని ప్రోత్సహిస్తున్నాం.' అని మెయిల్ ద్వారా తెలిపింది. రూ.50 వేలకు మించిన చెక్కుల పూర్తి వివరాలను ఐసీఐసీఐ బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ పూర్తి చేసే ముందు అదనపు వెరిఫికేషన్ లేయర్ యాడ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇది మోసపూరిత ట్రాన్సాక్షన్లను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. బ్యాంక్ అకౌంట్ నంబర్, చెక్ నంబర్, బెనిఫిషియరీ లేదా పేయీ పేరు, చెక్ అమౌంట్, చెక్ డేట్ వంటి కీలక వివరాలను అందించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకులు చెక్ వేగంగా క్లియర్ చేసేందుకు చెక్ జారీ చేసే వారు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. చెక్కులో పేర్కొనే నగదు సంఖ్య, అక్షర రూపంలో రాసే నగదు విలువ సరిపోలేలా ఉండాలి. చెక్కుపై వాలిడ్ డేట్ ఉండాలి. తేదీ, అమౌంట్, పేయీ పేరు వంటి వాటిని కొట్టివేయడం, మళ్లీ మళ్లీ రాయడం వంటివి చేయకూడదు. బ్యాంకులో ఉన్నట్లుగానే డ్రా చేసే వ్యక్తి సిగ్నేచర్ ఉండాలి.