తెలంగాణకు చెందిన మాజీ, సిట్టింగ్ మంత్రులు రూ. 100 కోట్ల కస్టమ్స్ మోసం కేసులో చిక్కుకున్నారు. ఈ మేరకు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఓ నేత, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సిట్టింగ్ మంత్రిగా ఉన్న మరో నేత హై- ఎండ్ విలాసవంతమైన కార్ల అక్రమ దిగుమతి కేసులో నిందితుడైన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బషారత్ ఖాన్ పఠాన్ నుంచి లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కార్లను తక్కువ ధరలకు కొనుగోలు చేశారా లేదా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.అసలు కేసు ఏంటి..?హైదరాబాద్‌లోని 'కార్ లాంజ్' అనే లగ్జరీ కార్ల షోరూం యజమాని అయిన బషారత్ ఖాన్ పఠాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 100 కోట్ల కస్టమ్స్ మోసం కేసులో అతడ్ని అహ్మదాబాద్ నగరానికి చెందిన అధికారులు అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ పోర్టులలో లగ్జరీ వాహనాలను వాటి వాస్తవ విలువలో 50 శాతం తక్కువగా చూపించి.. తప్పుడు లెక్కలతో దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కస్టమ్స్ సుంకాలను రూ. 100 కోట్లకు పైగా ఎగవేసినట్లు అధికారులు అంచనా వేశారు.ఎలా బయటపడింది..?లగ్జరీ కార్ల అక్రమ దిగుమతులపై ఇంటెలిజెన్స్ అధికారి సుశీల్ చౌధరికి అందిన సమాచారంతో ఈ దర్యాప్తు మొదలైంది. హైదరాబాద్‌లోని ఎస్.కె. కార్ లాంజ్ షోరూం ఎనిమిది లగ్జరీ కార్లను (1 రోల్స్ రాయిస్, 2 లెక్సస్, 5 టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లు) దిగుమతి చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి. ఒక ల్యాండ్ క్రూయిజర్ 300 కారు విలువను సుమారు రూ. 20.91 లక్షలు, ఒక రోల్స్ రాయిస్ కల్లినన్ విలువను సుమారు రూ. 1.24 కోట్లు, ఒక లెక్సస్ ఎల్ఎక్స్-500డి విలువను సుమారు రూ. 50.08 లక్షలు తక్కువగా చూపించినట్లు బషారత్ ఒప్పుకున్నాడు. అతను దిగుమతి చేసుకున్న అన్ని కార్లను తక్కువ విలువతో చూపించి, రూ. 7 కోట్ల కస్టమ్స్ సుంకాలను ఎగవేసినట్లు ఒప్పుకున్నాడు.డీఆర్ఐ దర్యాప్తులో.. బషారత్ ఖాన్ రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. గత పది సంవత్సరాలుగా తన షోరూం ద్వారా చిన్న కార్ల నుంచి హై-ఎండ్ కార్ల వరకు విక్రయిస్తున్నాడు. ఇతను చాలా మంది వీఐపీలకు, రాజకీయ నాయకులకు కార్లను అద్దెకు కూడా ఇస్తుంటాడని పేరుంది. ఎందరో రాజకీయ నాయకులకు లగ్జరీ కార్లను విక్రయించాడని, అందులో ప్రస్తుత, మాజీ మంత్రులు ఉన్నారని అధికారులు తెలిపారు. బషారత్ కస్టమర్లు చాలామంది పన్నులు ఎగవేయడానికి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి కార్లను నగదు రూపంలో కొనుగోలు చేసేవారని కూడా దర్యాప్తులో వెల్లడైంది.