ఏపీ ప్రజలకు మరో తీపికబురు.. మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కబోతోంది. ఈ రైలు తిరుమల శ్రీవారి భక్తులకు కూడా ఉపయోగంగా ఉంటుంది. దాదాపు ఐదు నెలలుగా ఈ రైలు గురించి చర్చ జరుగుతుండగా.. ఈసారి పక్కాగా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు కొత్త వందేభారత్ వయా తిరుపతి మీదుగా ప్లాన్ చేశారు. మే నెలలోనే ఈ ప్రతిపాదనలు తెరపైకి రాగా.. ఆ తర్వాత క్లారిటీ రాలేదు. తాజాగా ఈ రైలును దీపావళికి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరుకు ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు తగ్గుతుందని చెబుతున్నారు. అటు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఉపయోగంగా ఉంటుందంటున్నారు.ఈ విజయవాడ-బెంగళూరు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దీపావళి పండుగకు దేశవ్యాప్తంగా ప్రారంభించే ఐదు కొత్త రైళ్లలో ఒకటిగా ఉందని చెబుతున్నారు.. త్వరలోనే ఈ రైలుపై ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరుకు 8 నుంచి 9 గంటల్లోనే చేరుకోవచ్చని.. అలాగే విజయవాడ నుంచి తిరుపతికి నాలుగు గంటల్లోనే వెళ్లొచ్చంటున్నారు. అయితే వాస్తవానికి రెండు, మూడు నెలల క్రితమే ఈ వందేభారత్‌ను ప్రారంభించాలనుకున్నారట. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది అంటున్నారు. తాజాగా ఈ రైలును దీపావళి నుంచి పట్టాలెక్కించాలని భావిస్తున్నాటరు.విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఆరు రోజులు నడిచేలా ప్లాన్ చేశారట. మంగళవారం మాత్రం ఈ రైలు అందుబాటులో ఉండేలా షెడ్యూల్ రూపొందించారట. విజయవాడ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు చేరుకునేలా షెడ్యూల్ నిర్ణయించారట. ఈరైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్ ఉంటుందట. ఈ రైలు తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరుతుందట.. రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుందట. ప్రస్తుతం విజయవాడ నుండి బెంగళూరు వెళ్లడానికి కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది.. వారానికి 3 రోజులు మాత్రమే నడుస్తుంది. వందేభారత్ రైలు రాకతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది అంటున్నారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి.. ఉదయం 5.39కు తెనాలి, ఉదయం 6.28కు ఒంగోలు, ఉదయం 7.43కు నెల్లూరు, ఉదయం 9.45కు తిరుపతి, చిత్తూరుకు ఉదయం 10.27, కాట్పాడి రైల్వే స్టేషన్‌కు ఉదయం 11.13కు, కృష్ణరాజపురం మధ్యాహ్నం 13.38కు, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకు మధ్యాహ్నం 14.15 చేరుకునేలా ప్లాన్ చేశారట. ఈ రైలు అదే రోజు తిరుగు ప్రయాణంలో.. బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 14.58కు కృష్ణరాజపురం, కాట్పాడి సాయంత్రం 17.23కు, చిత్తూరు సాయంత్రం 17.49, తిరుపతి సాయంత్రం 18.55, నెల్లూరు రైల్వే స్టేషన్‌కు రాత్రి 20.18, ఒంగోలు రైల్వే స్టేషన్‌కు రాత్రి 21.29, తెనాలికి రాత్రి 22.42, విజయవాడకు రాత్రి 23.45 గంటలకు చేరుకుంటుంది' అని ఐదు నెలల క్రితం షెడ్యూల్ ఒకటి వైరల్ అయ్యింది. అయితే ఈ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై క్లారిటీ రావాల్సి ఉంది.