ఏపీలో ఉల్లి ధరలు భారీగా తగ్గిపోయాయి.. కేజీ కేవలం రూ.2కే మాత్రమే. కర్నూలు జిల్లాలో కిలో ఉల్లిపాయలు రూ.2కే అమ్మడం మొదలైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్ ఫెడ్ ద్వారా రైతుల నుండి క్వింటాల్ ఉల్లిని రూ.1200కు ప్రభుత్వం కొనుగోలు చేసింది. వ్యాపారులు కొన్న తర్వాత మిగిలిన ఉల్లిని ప్రజలకు తక్కువ ధరకే అందిస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో 45 కేజీల ఉల్లిపాయల సంచిని రూ.100కు ఇస్తున్నారు. అంటే కిలో ఉల్లిపాయలు దాదాపు రూ.2 మాత్రమే. ప్రభుత్వం రైతుల నుంచి ఉల్లిపాయలు కొని, ప్రజలకు తక్కువ ధరకు అమ్మడం బావుందంటున్నారు ప్రజలు. మార్కెట్ యార్డులో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు.కర్నూలు జిల్లా రైతులు ఉల్లి సాగులో ముందంజలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉల్లి పంటకు అనుకూలమైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వర్షాలు కురిశాయి. దీంతో మే నెలలోనే రైతులు పెద్ద ఎత్తున ఉల్లి సాగు చేపట్టారు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రావాల్సిన ఉల్లి పంట జులైలోనే మార్కెట్‌కు రావడం మొదలైంది. కర్నూలు ఉల్లి మార్కెట్‌కు పంట భారీగా వచ్చింది. ఉల్లి దిగుబడి బాగా పెరగడంతో మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కొనేవారు లేక రైతులు నష్టపోయారు. ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.చాలామంది రైతులు తమ పంటను మార్కెట్లోనే వదిలి వెళ్లిపోయారు. మరికొందరు పొలాల్లోనే ఉల్లిని కోయకుండా వదిలేశారు. ఇంకొందరు ఉల్లిగడ్డలను మేకలు, గొర్రెలకు వదిలేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాల్ ఉల్లిని రూ.1200 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇప్పటివరకు 13 వేల టన్నుల పంటను కొనుగోలు చేసింది.కర్నూలు మార్కెట్ యార్డులో 1900 టన్నుల ఉల్లి పంట ఉన్నట్లు కలెక్టర్ సిరి తెలిపారు. పర్జలకు 45 కేజీల ఉల్లి బస్తాను కేవలం రూ.100కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌ యార్డులో 4 కౌంటర్లు ఏర్పాటు చేశామని.. పోలీస్ వారి సహకారంతో ఉల్లిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఉల్లి విక్రయానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉల్లి రైతుల కష్టాలను తీర్చడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు పడిపోయి, అప్పుల పాలైన రైతులకు అండగా నిలబడాలని నిర్ణయించింది. క్వింటా ఉల్లికి రూ.1200 మద్దతు ధర ఇస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.. నష్టపరిహారం కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.