తిరుమల శ్రీవారి భక్తులకు పండగే.. దర్శనం మరింత త్వరగా, దేశంలోనే తొలిసారి ICCC

Wait 5 sec.

తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించనుంది. భక్తుల రద్దీని తగ్గించడానికి, వసతి, భద్రతను పెంచడానికి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఇది దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటైనట్లు లెక్క. కొండపై ఎన్‌ఆర్‌ఐల దాతృత్వంతో వైకుంఠం-1లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని నియంత్రిస్తారు. వసతి, భద్రతను కూడా మెరుగుపరుస్తారు.సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో భక్తుల రద్దీని అంచనా వేయడం, ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తింపు, సైబర్ దాడులను అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకుంటారు. ఐసీసీసీలో 25 మందికి పైగా సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలను పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తారు. అలిపిరి నుంచే ఏఐ సాంకేతికతతో భక్తుల రద్దీని అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో ఎంతమంది ఉన్నారు? ఎంత సమయం వేచి ఉన్నారు? సర్వదర్శనం పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో భక్తులను గుర్తుపట్టవచ్చు. చోరీలు, ఇతర నేరాలు జరిగినా వెంటనే గుర్తించవచ్చు. తప్పిపోయిన వారిని కూడా సులువుగా కనుగొనవచ్చు. భక్తుల ముఖ కవళికలను బట్టి వారి ఇబ్బందులను తెలుసుకునే అవకాశం ఉంది. క్యూలైన్లు, వసతి వంటి సౌకర్యాలను 3డీ మ్యాప్‌ల ద్వారా చూపిస్తారు. రద్దీగా ఉండే ప్రాంతాలను రెడ్ స్పాట్స్ ద్వారా గుర్తించి, వెంటనే చర్యలు తీసుకుంటారు. ఆన్‌లైన్‌లో వచ్చే సైబర్ దాడులను, టీటీడీ పరువు తీసేలా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను అడ్డుకుంటారు. తప్పుడు సమాచారాన్ని కూడా నిరోధిస్తారు. భక్తుల అనుభవాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, దర్శనాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి దగ్గరి మార్గాలను చూపిస్తుంది. గత అక్టోబరులో మంత్రి లోకేష్ అమెరికా వెళ్లినప్పుడు కొందరు ఎన్నారైలు ఈ కొత్త ఆలోచన చెప్పారు. అదే ఇంటిగ్రేటెడ్ కమాండ్ సిస్టం (ICCC). ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ ఎన్నారైలు తిరుమలలో దీని గురించి వివరించారు. డబ్బులు కూడా వారే ఇస్తామని చెప్పారు. దాదాపు రూ.30 కోట్లతో వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఈ సిస్టంను ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే మొదటిసారి అని అధికారులు తెలిపారు. ఎన్నారైలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ఈ ఒప్పందం కుదిరింది. ఉన్నతాధికారులు కూడా సహకరించారు.. అందుకే ఇది సాధ్యమైంది.