హైదరాబాద్‌లో కొత్తగా 10 బస్ డిపోలు.. 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు: సజ్జనార్

Wait 5 sec.

తెలంగాణ హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించడానికి, ప్రజా రవాణాను మెరుగుపరచడానికి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పలు డిపోల పరిధిలో పరుగులు పెడుతున్నాయి. పర్యావరణహితంతో పాటుగా.. డీజిల్ బస్సులతో పోల్చితే ఖర్చు తక్కువగా ఉండటంతో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. దీంతో రాజధానిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడవనున్నాయి. కేవలం బస్సులు ప్రవేశపెట్టడమే కాకుండా.. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఆర్టీసీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం కేంద్రాలు ఉండగా.. త్వరలో మరో 9 డిపోల్లో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా నగరం అంతటా రవాణాను మెరుగుపరచడానికి కొత్తగా 10 డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ప్రణాళికలు వేసింది. ఈ కొత్త డిపోల్లో కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి స్థలం కోసం అన్వేషణ జరుగుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో పాత గౌలిగూడ బస్టాండ్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తోంది. దీనిని కేవలం బస్‌స్టాండ్ గానే కాకుండా.. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఒక పెద్ద ఛార్జింగ్ స్టేషన్‌గా మార్చాలని చూస్తోంది. ఈ నిర్ణయం వల్ల నగరంలో రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడనుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 7,754 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారికి సురక్షితమైన ప్రయాణ సేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు.