ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. ఏకంగా రూ.6,292 కోట్లు, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2022 ఏప్రిల్ 8న ప్రభుత్వం వి నుండి వసూలు చేసే సుంకాన్ని 6 పైసల నుంచి రూపాయికి పెంచగా.. దీనికి సంబంధించిన జీవోఎంఎస్‌ నంబరు 7ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా వినియోగదారులకు రూ.6,292 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు గత జూన్‌ 26న జారీచేసిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఎ.ఎస్‌. చందూర్కర్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను 2026 ఫిబ్రవరికి వాయిదావేసింది. ఏపీ ప్రభుత్వం 2022లో జీవోఎంఎస్‌ నంబరు 7 ద్వారా విద్యుత్ సుంకాలు పెంచింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఎ.ఎస్‌. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారణ చేసింది.ఇది రాజ్యాంగపరమైన అంశం కాబట్టి వాదనలు వింటామని కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పులోని రీఫండ్‌ అంశంపై స్టే విధించారు. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పులోని రీఫండ్‌ అంశంపై స్టే ఇచ్చినట్లు ధర్మాసనం తెలిపింది. ఈ కేసు తేలేంత వరకు పెంచిన సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. 1994లో జారీ చేసిన జీవో ప్రకారం 6 పైసల సుంకం మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2026 ఫిబ్రవరికి వాయిదా వేశారు. 1939లో ఏపీ విద్యుత్తు సుంకాల చట్టం ప్రకారం, విద్యుత్ అమ్మే లైసెన్స్ ఉన్నవాళ్ల దగ్గర నుంచి ప్రభుత్వం యూనిట్‌కు 4 పైసలు వసూలు చేసేది. 1994లో ఈ సుంకాన్ని 4 పైసల నుంచి 6 పైసలకు పెంచారు. అప్పుడు డిస్కంలు (Discoms) ఒక విజ్ఞప్తి చేశాయి. ఆ భారాన్ని తాము మోయలేమని, వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. ప్రభుత్వం 1994లో జీవో నంబరు 277 విడుదల చేసింది. దీని ద్వారా డిస్కంలకు అనుమతి లభించింది. ఆ తరువాత 2021 ఆగస్టు 26న ప్రభుత్వం మరో సవరణ చేసింది. వేర్వేరు వినియోగదారులకు వేర్వేరుగా సుంకం విధించే అవకాశం వచ్చింది. 2022 ఏప్రిల్ 8న జీవో ఎంఎస్‌ నంబరు 7 జారీ చేశారు. గృహ, వ్యవసాయ వినియోగదారులను వదిలి, మిగిలిన వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులపై విద్యుత్తు సుంకాన్ని యూనిట్‌కు 6 పైసల నుంచి రూ.1కి పెంచారు. దీనివల్ల డిస్కంలు వినియోగదారుల నుంచి రూ.6,292.18 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాయి. ఆ తర్వాత ఈ వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. అయితే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ 8న జారీచేసిన జీవోఎంఎస్‌ నంబరు 7ను ఈ ఏడాది జూన్‌ 26న కొట్టేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేయగా.. కోర్టు స్టే విధించింది.