తెలంగాణలో జోరు వానలు.. నేడు ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు

Wait 5 sec.

తెలంగాణను వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడిందని దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం మయన్మార్‌లోని యాంగోన్ తీరానికి దగ్గరగా ఉందని... వచ్చే రెండు రోజుల్లో ఇది ఉత్తరం వైపుగా కదులుతుందన్నారు. దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.నేడు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి.. విస్తారంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్ సహా పశ్చిమ, మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. రాత్రి 9 గంటల తర్వాత తెలంగాణ అంతటా వర్షాలు మరింత పెరిగి అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగుతాయన్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటసేపు కురిసిన భారీ వర్షానికి నాగోల్ సాయినగర్ వైపు వరద నీరు భారీగా వచ్చి చేరింది. వరద ఉధృతికి కొన్ని బైక్‌లు కొట్టుకుపోయాయి. ఎల్బీనగర్‌లో గంటకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నాగోల్, బండ్లగూడలో 8.78 సెం.మీ, ఎల్బీనగర్‌లో 3.6 సెం.మీ, రామాంతాపూర్‌లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంటార్కిటికా నుంచి వస్తున్న శీతల గాలులు, భూమధ్య రేఖ ప్రాంతంలో పోగైన మేఘాల వల్ల ఈ నెల మొత్తం వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు.