ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభవార్త.. రాష్ట్రంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఈ మేరకు సంగం డెయిరీ, విజయ డెయిరీలు ధరలు తగ్గించాయి.. జీఎస్టీ తగ్గడంతో డెయిరీలో ధరల్ని తగ్గించాయి. ఈ మేరకు విజయ డెయిరీ లీటరు పాలపై రూ.5 వరకు తగ్గించింది. పన్నీర్, వెన్న, నెయ్యి ధరలను కూడా తగ్గించింది. సంగం డెయిరీ కూడా పాల ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఈ తగ్గింపు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుంది.కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పాలు, పాల ఉత్పత్తుల తగ్గిన ధరలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. విజయ డెయిరీ (టెట్రా) పాల ధర లీటరుకు రూ.5 తగ్గింది. పన్నీర్ కిలోపై రూ.20, వెన్న కిలోపై రూ.30, నెయ్యి కిలోపై రూ.30 తగ్గించినట్లు చెప్పారు. ఫ్లేవర్డ్ మిల్క్ లీటరుపై కూడా రూ.5 వరకు తగ్గించారు. ఈ తగ్గిన ధరలు ఈ నెల 22 నుంచి విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాల్లో అమల్లోకి వస్తాయని తెలిపారు. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా ధరల తగ్గింపు వివరాలు వెల్లడించారు. యూహెచ్‌టీ పాలు లీటరుపై రూ.2 తగ్గింది. పన్నీర్ కిలోపై రూ.15, నెయ్యి కిలోపై రూ.30, వెన్న కిలోపై రూ.30 తగ్గించారు. మిల్క్ షేక్‌ల ధర లీటరుకు రూ.5 తగ్గింది. బేకరీ ఉత్పత్తుల ధర కిలోపై రూ.20 వరకు తగ్గించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ధరల తగ్గింపు ఈ నెల 22 నుంచి అన్ని సంగం డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాల్లో అమల్లోకి వస్తుంది అన్నారు. అయితే మరికొన్ని డెయిరీల పాలు, పాల ఉత్పత్తులు కూడా తగ్గించారు.. మరికొన్ని డెయిరీలు తగ్గింపుపై ప్రకటన చేయాల్సి ఉంది. మొత్తం మీద జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతోసామాన్యులకు ఊరట దక్కిందనే చెప్పాలి. పాలు, పాల ఉత్పత్తులు మాత్రమే కాదు మరికొన్ని వస్తువులపై కూడా జీఎస్టీ ధరల్ని తగ్గించిన సంగతి తెలిసిందే.