ఆంధ్రప్రదేశ్‌లో 17 పార్టీలకు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది.. ఆ పార్టీలను రద్దు చేసింది. ఎన్నికల సంఘం (ఈసీ) దేశవ్యాప్తంగా గుర్తింపు లేని 474 పార్టీలను రద్దు చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేయగా.. తాజాగా రద్దు చేసిన 474తో కలిపి మొత్తంగా రెండు నెలల్లో 808 పార్టీలను ఈసీ రద్దు చేసింది. ఆరేళ్లలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని పార్టీలను ఈసీ తొలగిస్తోంది. ఇలాంటి పార్టీలు చాలా కాలంగా ఎన్నికల్లో పాల్గొనడం లేదు. అందుకే వాటిని జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈసీ రద్దు చేసిన పార్టీల వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆలిండియా లిబరల్‌ పార్టీ, భారత్‌ ప్రజా స్పందన పార్టీ, ఆలిండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ,వెనుకబడినవర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్‌ఆర్‌ బహుజన పార్టీ, గ్రేట్‌ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగురాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్‌పార్టీ, పొలిటికల్‌ ఎసెన్షియల్‌ అండ్‌ యాక్యురేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ పార్టీలు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే.. లోక్‌సత్తాపార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, ఆలిండియా ఆజాద్‌పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, భారత్‌ లేబర్‌ ప్రజాపార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్‌ నేషనల్‌ పార్టీలను ఈసీ రద్దు చేసింది. అయితే త్వరలోనే మరో 359 పార్టీలను కూడా జాబితా నుంచి ఈసీ తొలగించనుంది. వీటీలో ఏపీవి 8, తెలంగాణవి 10 పార్టీల వరకు ఉండబోతున్నాయి. ఎన్నికల సంఘం జాబితాలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీలు ఆరు, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందినవి 67 పార్టీలు ఉన్నాయి. అయితే మరో 2,046 నమోదై గుర్తింపు పొందనవి ఉన్నాయి.