ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పేదల సొంతింటి కలను నాశనం చేయడమేనని విమర్శించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేస్తూ.. ఎక్స్‌లో ఒక సుదీర్ఘ పోస్టును పెట్టారు.ఈ సందర్భంగా చంద్రబాబుపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికేనా.. వారి సొంతింటి కలలను నాశనం చేయడానికేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ పేదలకు ఏదైనా ఇచ్చేది కాదని.. వారి వద్ద ఉన్నవాటిని లాక్కునే రద్దుల ప్రభుత్వమని మండిపడ్డారు. నిరుపేద మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు.గతంలో 2019 నుంచి 2024 వరకు తమ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను పేద మహిళలకు ఇచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాటి కోసం రూ.11,871 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ దాదాపు రూ.1.5 లక్షల కోట్ల పైనే ఉంటుందని అంచనా వేశారు. తాము 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేస్తే.. కరోనా మహమ్మారి సమయంలో సంక్షోభం తలెత్తినప్పటికీ 9 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినట్లు చెప్పారు. 2023 అక్టోబర్ 12వ తేదీన ఒకేసారి 7,43,396 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని జగన్ వెల్లడించారు.ఇక ఇంటి నిర్మాణంలో అవసరమయ్యే సిమెంట్, స్టీల్ వంటి 12 రకాల వస్తువులను తమ సర్కార్ తక్కువ ధరకే అందించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. ప్రతీ లబ్ధిదారునికి రూ.40 వేల మేర లబ్ధి చేకూర్చినట్లు గుర్తు చేశారు. వీటికి అదనంగా ఉచిత ఇసుక పంపిణీ, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.1.8 లక్షలతో కలిపి ఒక్కో ఇంటికి రూ.2.7 లక్షల లబ్ధి చేకూరినట్లు వివరించారు. కానీ ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలను ఆపేశారని ఆరోపించారు.అమరావతిలో 50 వేల ఇళ్ల పట్టాలను వైసీపీ ప్రభుత్వం ఇస్తే.. చంద్రబాబు నాయుడు కోర్టుల్లో కేసులు వేసి వాటిపై స్టే తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమరావతితో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ చర్యలు పేద కుటుంబాలపై కక్ష సాధించడమేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. వీటితోపాటు ధర్నాలు, నిరసనలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.