తెలంగాణలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. భారీగా తొలగింపులు.. నియామకాలు..?

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో సిబ్బంది నియామకాల విషయంలో స్పష్టతనిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి (). అవసరమైన చోట మాత్రమే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నియమించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ సిబ్బంది అవసరం ఉందో, ఎక్కడ అనవసరమో నిర్ణయించే బాధ్యతను పూర్తిగా అధికారులకే అప్పగించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నియామకాలు అవసరానికి మించి జరిగాయనే ఆరోపణలు రావడంతో, పరిస్థితిని సమీక్షించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీతో ఇటీవల జరిగిన సమావేశంలో... “ఎవరిని తొలగించమని నేను చెప్పను, ఎవరిని నియమించమని కూడా చెప్పను. అవసరాన్ని మీరు గుర్తించాలి” అని సీఎం రేవంత్ సూచించినట్లు సమాచారం. ఈ దిశగా శాంతికుమారి కమిటీ విభాగాల వారీగా డేటాను సేకరిస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు? ఆధార్, బ్యాంక్ వివరాలు సిస్టంలో నమోదు చేశారా? వంటి అంశాలపై నివేదిక తయారు చేస్తోంది. గతంలో జరిగిన అవినీతి ఆరోపణలు ఈ చర్యలకు కారణమయ్యాయి. ఒకే వ్యక్తి పేరుతో రెండు మూడు కార్యాలయాల్లో జీతాలు తీసుకోవడం, హాజరు కాకుండా వేతనాలు పొందడం, కొన్ని శాఖల్లో అవసరం లేకుండా సిబ్బంది పెరగడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీనికి అడ్డుకట్ట వేయడం, భవిష్యత్‌లో నియామకాలలో పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా సీఎం చర్యలు ప్రారంభమయ్యాయి.ఈ నివేదిక ఆధారంగా ఏ శాఖల్లో నిజమైన ఉద్యోగులు ఎంత అవసరం ఉందో గుర్తించి, సిబ్బంది నియామకాలను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, ప్రజలకు అవసరమైన చోట తగిన సేవలు అందే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీని ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు ప్రభుత్వానికి ఇంకా అవసరం అనే సంకేతాలను ఇస్తుంది.