భారతీయ రైల్వేలు.. రోజురోజుకూ బాగా డెవలప్ అవుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుని.. అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వందే భారత్ రైలు.. భారత రైల్వే చరిత్రలోనే ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లు, వందే మెట్రో రైళ్ల పేరుతో రకరకాల రైళ్లను.. రైల్వే శాఖ క్రమ క్రమంగా పట్టాలెక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన అమృత్ భారత్ రైళ్లు.. దేశంలో ప్రయాణించే సామాన్య ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తున్నాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ వేగంతో.. సుదూర ప్రాంతాలకు ఈ అమృత్ భారత్ రైళ్లు ప్రయాణం చేస్తూ.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో అమృత్ భారత్ రైలును నడిపే మార్గాన్ని రైల్వే శాఖ తెలిపింది. ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ మీదుగా అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా ఎక్స్ వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. ఒడిశాలోని బ్రహ్మపుర రైల్వే స్టేషన్ నుంచి.. గుజరాత్‌లోని సూరత్‌కు సమీపంలోని ఉద్నా రైల్వే స్టేషన్‌కు మధ్య ఈ అమృత్ భారత్ రైలును నడపనున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇక ఈ మార్గంలో ఉత్తరాంధ్రలోని 2 స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణించనుందని పేర్కొన్నారు. బ్రహ్మపుర-ఉద్నా అమృత్‌ భారత్‌ రైలు త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ రైలును ఎప్పుడు ప్రారంభిస్తారు అనేదీ మాత్రం ఆయన మంత్రి చెప్పలేదు. ఇక బ్రహ్మపుర, ఉద్నా స్టేషన్ల మధ్య మొత్తం 12 స్టేషన్లలో ఈ రైలును ఆగనుంది. ఇక ఉత్తరాంధ్రలోని పలాస, విజయనగరం స్టేషన్లలో రైలు ఆగనుంది.దేశంలోని పేద, మధ్యతరగతి రైలు ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను భారతీయ రైల్వే నడుపుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11 అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లు కూడా ఉన్నాయి. తాజాగా మరొకటి అందుబాటులోకి రానుంది.అమృత్ భారత్ రైళ్లలో అనేక అత్యాధునిక ఫీచర్లు కల్పించారు. ఈ రైళ్లకు మొత్తం 22 బోగీలు ఉండగా.. అందులో 12 స్లీపర్‌, 8 జనరల్‌, 2 లగేజీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇక రైలు మొత్తం సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీట్ వద్ద మొబైల్‌ ఛార్జింగ్‌, కమ్యూనికేషన్ సిస్టమ్, బయో వ్యాక్యూమ్‌ టాయిలెట్లు, సెన్సార్‌లు కలిగిన ట్యాప్‌ల వంటి సౌకర్యాలు ఉంచారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి అనుగుణంగా సౌకర్యవంతమైన సీట్లు, ఎల్‌ఈడీ లైట్లు, ఆధునిక డిజైన్లలో ఫ్యాన్లు, స్విచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ అమృత్ భారత్ రైళ్లలో ఒకేసారి 1800 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న నగరాలను కలుపుతూ ఈ అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి.