ఆపరేషన్ సిందూర్‌తో , పీఓకే గడ్డపై భారత సైన్యం చేసిన దాడులు.. పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకున్నట్లు అయింది. పీఓకే, పాక్ గడ్డపై ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ.. భీకర దాడులకు తెగబడటంతో.. ఉగ్రవాదుల వెన్నుపూసలు కదిలిపోయాయి. ఉగ్రవాదులకు చెందిన అగ్ర సంస్థల కార్యాలయాలు నేలమట్టం కావడంతో వంద మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఉగ్ర సంస్థలను భారత దళాలు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. జరిగిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడిప్పుడు కొన్ని ఉగ్ర సంస్థలు.. మళ్లీ తమ క్యాంపులను నిర్మించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని 9 టెర్రరిస్ట్ క్యాంపులపై భారత్ వైమానిక దాడులకు దిగింది. మురిద్కే ప్రాంతంలోని లష్కరే తోయిబా.. బహవల్పూర్‌ ప్రావిన్స్‌లోని జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్‌ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత సరిహద్దులతోపాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను.. వారు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలు.. తమ స్థావరాలను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతాల్లోకి మారుస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్ నిరంతరం పర్యవేక్షిస్తున్న తరుణంలో.. ఆ ప్రాంతంలో మళ్లీ ఉగ్ర శిబిరాలు నెలకొల్పడం అంత సురక్షితం కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందేక భారత సరిహద్దుకు దూరంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా కొండలు, లోయలు కలిగి ఉన్న అయితే తమకు సేఫ్‌గా ఉంటుందని ఉగ్రవాదులు భావిస్తున్నారు.ఇటీవలె పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్సెహ్రా జిల్లాలోని గర్హి హబీబుల్లాలో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఒక మతపరమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కొత్తగా ఉగ్రవాదులను నియమించుకోవడమేనని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి జైషే మహ్మద్ కీలక కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వచ్చినట్లు సమాచారం. ఉగ్రవాదులకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను కంచుకోటగా మారుస్తానని అతడు పేర్కొనడం గమనార్హం. మరోవైపు.. ఈనెల సెప్టెంబర్ 25వ తేదీన ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌లో జైషే మహ్మద్ భారీ సమావేశం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక మరో ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కూడా ఖైబర్ ఫఖ్తుంఖ్వాకు తరలి వెళ్లే పనిలో పడింది. ఇస్లామాబాద్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయర్ దిర్ జిల్లాలోని బందాయ్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఒక ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దానికి హెచ్ఎమ్ 313 (HM 313) అని పేరు కూడా పెట్టింది. మరోవైపు.. ఉగ్రవాదానికి సెంటర్ పాయింట్‌గా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఉండటం గమనార్హం. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్ కోట్‌లో పుట్టిన మసూద్ ఇలియాస్ కాశ్మీర్.. 2001లో జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలో చేరాడు. 2000 మొదట్లో ఆఫ్ఘనిస్తాన్‌లో నాటో దళాలతో పోరాడిన కాశ్మీరీ.. 2018లో జమ్మూలో సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్‌పై చేసిన దాడిలో సూత్రధారిగా ఉన్నారు.