టీం డిన్నర్‌‌లో తిని, తాగి ఎంజాయ్ చేయమన్నారు.. తెల్లారి ఉద్యోగం పీకేశారు.. ఎవరికి చెప్పుకోవాలి బ్రో

Wait 5 sec.

: కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం అంటే ఒకప్పుడు ప్రభుత్వం ఉద్యోగంతో సమానంగా భావించే వారు. ఒకసారి ఉద్యోగంలో చేరితే లైఫ్ సెటిల్ అయ్యిందనుకునే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న కంపెనీల నుంచి మొదలు పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు సైతం ఖర్చులు తగ్గించుకుంటున్నామనే సాకులతో ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతున్నాయి. ఉన్నఫలంగా ఉద్యోగం మానేయాలని చెబుతూ ఊహించని షాకులు ఇస్తున్నాయి. ఇటీవలే దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకు మించి ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయని, ఐటీ ఉద్యోగుల సంఘాలు సైతం దీనిపై కేంద్రానికి లేఖలు రాశాయి. ఇప్పుడు ఈ విషయంపై చర్చ కొనసాగుతోంది. కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం అందించకుండానే చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాయ్ ఆఫ్ మాస్ (MASS) అనే ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. 'కాస్ట్ కట్టింగ్ లేఆఫ్స్ జరగడం నిజం. మా మొత్తం టీం రాజీనామా చేయాలని కోరడంతో మేము అధికారికంగా నోటీస్ పీరియడ్‌లో ఉన్నాం. అందులో చాలా మందికి ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు, హెల్త్ బిల్స్ చెల్లించాల్సి ఉంది. వివాహ ప్రతిపాదనలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ ఉద్యోగ భద్రత లేని కార్పొరేట్ ప్రపంచంలో జీవితాన్ని ప్లాన్ చేయడం కుదరదు.' అంటూ రాసుకొచ్చారు. టీం డిన్నర్‌లో ఎంజాయ్ చేయండి అన్నారు..ఈ పోస్టుకు సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. గంటల వ్యవధిలోనే ఇది 3500లకు పైగా వ్యూస్ సాధించింది. ఆ పోస్ట్ ప్రకారం.. 'మాకు అయితే టీమ్ డిన్నర్ అని బాగా తినండి, తాగండి అని ఫుల్ ఖర్చు పెట్టారు. రేపు హెచ్ఆర్ షెడ్యూల్ చేస్తది టీమ్ కాల్‌కు ఒకరి తర్వాత ఒకరు రండీ అన్నారు. కాల్ అటెండ్ అయితే రేపు ఆఫీసుకు వచ్చి కంపెనీ ల్యాప్‌టాప్, ఐడీ కార్డు సబ్మిట్ చేసి పొండీ చెప్పారు. ఎలాంటి నోటీసు పీరియడ్ లేకుండా డైరెక్ట్ లేఆఫ్ చేశారు' అని తన బాధను రాసుకొచ్చారు.