చిన్న చిన్న టీమ్స్‌తో పాటు అప్ఘనిస్తాన్ కూడా ఇంటిదారి పట్టింది. ఇప్పటివరకు చప్పగా సాగిన ఈ పోరు ఇకపై రసవత్తరంగా మారనుందని చెప్పొచ్చు. గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్ బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. సూపర్ 4 మ్యాచ్‌లు కూడా ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. సూపర్ 4లో అర్హత సాధించిన నాలుగు జట్లు తలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క జట్టు మిగతా మూడు జట్లపై ఆడాలి. వీటిల్లో ఎక్కువ ఏ మ్యాచ్‌లు ఏ జట్లు గెలుస్తాయో అవి మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. ఆ రెండు జట్లు ఫైనల్స్‌లో తలపడుతాయి. సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే సూపర్ 4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 26 వరకు జరుగుతాయి. సెప్టెంబర్ 28న ఫైనల్స్ జరగనుంది. సూపర్ 4 నుంచి ఫైనల్స్ వరకు అన్ని మ్యాచ్‌లు దుబాయ్ వేదికగానే సాగనున్నాయి. శ్రీలంక - బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4లో తొలి మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్ బీలో టాప్ 2లో నిలిచిన ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ ఆసియా కప్‌లో శ్రీలంక జట్టు అనూహ్యంగా ఫామ్‌లోకి వచ్చింది. గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే గ్రూప్ స్టేజ్‌లో లంకపై ఓడిన బంగ్లా ఈ సూపర్ 4లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌ని ఆదివారం పాకిస్తాన్‌తో ఆడనుంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్‌పై ఘోర ఓటమిని మూటగట్టుకోవడమే కాకుండా, హ్యాండ్ షేక్ వివాదంతో పెద్ద రచ్చ చేసిన పాకిస్తాన్ సూపర్ 4లో రాణించాలని చూస్తోంది. ఇక గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను చిత్తు చేసిన భారత్ సూపర్ 4లోనూ అదే హవా కొనసాగించాలని చూస్తోంది. సూపర్ 4 షెడ్యూల్ ఇదేసెప్టెంబర్ 20 శ్రీలంక - బంగ్లాదేశ్, సెప్టెంబర్ 21 భారత్ - పాకిస్తాన్, సెప్టెంబర్ 23 పాకిస్తాన్ - శ్రీలంక, సెప్టెంబర్ 24 భారత్ - బంగ్లాదేశ్, సెప్టెంబర్ 25 పాకిస్తాన్ - బంగ్లాదేశ్, సెప్టెంబర్ 26 భారత్ - శ్రీలంక మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్ లైవ్‌లను సోన్నీ స్పోర్ట్స్, సోనీ లివ్‌లో వీక్షించొచ్చు.